Congress: పథకాలే ప్రచారాస్త్రాలు!
ABN , Publish Date - Jun 06 , 2025 | 04:02 AM
రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లి.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి ఆదరణను పొందాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ సూచించారు.
ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లి స్థానిక ఎన్నికల్లో ఆదరణ పొందాలి
అన్ని స్థాయుల నేతల సమన్వయంతో పనిచేయాలి: మీనాక్షి నటరాజన్
మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వరంగల్ పార్లమెంట్ పరిధి నేతలతో భేటీ
హైదరాబాద్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లి.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి ఆదరణను పొందాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రభావం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. గురువారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వరంగల్ పార్లమెం ట్ నియోజకవర్గాల పరిధి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో సమీక్ష సమావేశం జరిగింది. మీనాక్షి మాట్లాడుతూ.. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల్లో పార్టీ పట్ల అంకితభావం, చిత్తశుద్ధితో పనిచేసిన వారి కి కచ్చితంగా గుర్తింపు, గౌరవం దక్కుతుందనే భరోసానిచ్చారు. కొన్నిప్రాంతాల్లో పార్టీ సీనియర్లకు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల మధ్య కొంత సమన్వయ లోపమున్నట్టు గుర్తించినట్లు చెప్పారు. కాగా, జిల్లాల్లోని కొంతమంది ఉన్నతాధికారులు తమ మాటను ఖాతరు చేయడంలేదని.. దీంతో పార్టీ కార్యకర్తలకు సాయం అందించలేకపోతున్నామని మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ నేతలు మీనాక్షి దృష్టికి తెచ్చా రు. ఈ విషయంపై సీఎంతో చర్చించి చక్కదిద్దడానికి యత్నిస్తానని ఆమె హామీనిచ్చినట్టు తెలిసింది. మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ.. త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ పథకాలను ప్రజలకు సూటిగా వివరించాలన్నారు.
మల్లు రవిపై చర్యలు తీసుకోండి..
క్రమశిక్షణ కమిటీ చైర్మన్, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవిపై చర్యలు తీసుకోవాలంటూ మీనాక్షి నటరాజన్, మహేశ్ గౌడ్‌కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. అలంపూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే విజయుడుతో సన్నిహితంగా ఉంటూ పెండింగ్ బిల్లులు ఇప్పిస్తూ కమీషన్లు తీసుకుంటున్నారని.. తమ ను పట్టించుకోవట్లేదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. ఇటీవలే పార్టీలో చేరిన అచ్చంపేటకు చెందిన ఓ నాయకుడికి పదవి ఇవ్వడానికి పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్టు ఇప్పటికే ఆయనపై ఫిర్యాదులున్నాయి. అలాగే మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ సరిత తిరుపతయ్య, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి సైతం పార్టీ కార్యకర్తలను పట్టించుకోవట్లేదని ఫిర్యాదులో ప్రస్తావించినట్లు తెలిసింది. ఆయా ఫిర్యాదులను పరిశీలించిన మీనాక్షి.. సమీక్ష సమావేశాల సందర్భంగా మల్లు రవిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ పట్ల అంకితభావంతో పని చేస్తున్న కార్యకర్తలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. ఇతర పార్టీ నేతలకు వత్తాసు పలికే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించినట్లు తెలిసింది.