Meenakshi Natarajan: 20లోగా నియోజకవర్గాల నివేదికలు ఇవ్వాలి
ABN , Publish Date - Jun 05 , 2025 | 03:26 AM
ఈ నెల 20వ తేదీలోగా మిగిలిన శాసనసభ నియోజకవర్గ సమావేశాలు కూడా పూర్తి చేసి పార్టీ పరిస్థితిపై సమగ్ర నివేదికలు అందించాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీ పరిశీలకులను ఆదేశించారు.
కో-ఆర్డినేటర్లు, పరిశీలకుల సమీక్షలో మీనాక్షి నటరాజన్
హైదరాబాద్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 20వ తేదీలోగా మిగిలిన శాసనసభ నియోజకవర్గ సమావేశాలు కూడా పూర్తి చేసి పార్టీ పరిస్థితిపై సమగ్ర నివేదికలు అందించాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీ పరిశీలకులను ఆదేశించారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రె్‌సలో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గంలో నేతల మధ్య సమన్వయం కుదుర్చడానికి చొరవ తీసుకోవాలని సూచించారు. బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన జై భీమ్.. జై బాపూ.. జై సంవిధాన్, ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర కమిటీ కోఆర్డినేటర్లు, పీసీసీ నియోజకవర్గ పరిశీలకులతో జరిగిన సమీక్షలో మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీనాక్షి మాట్లాడుతూ.. ప్రజలకు, పార్టీకి, ప్రభుత్వానికి మరింత సమన్వయం పెంచడానికి నాయకులు చొరవ తీసుకోవాలన్నారు. జై భీమ్.. జై బాపూ.. జై సంవిధాన్ యాత్రకు సంబంధించి నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయి నివేదికలతో పాటు కోఆర్డినేటర్లు, పరిశీలకుల నుంచి ఆయా శాసనసభ నియోజకవర్గాల వారీగా పార్టీ వాస్తవ పరిస్థితిపై అందిన నివేదికలను మీనాక్షి సమీక్షించారు. గద్వాల, చేవెళ్ల ప్రాంతాల్లో ఎమ్మెల్యే-నియోజకవర్గ నేతల మధ్య సమన్వయ లోపంపై ఆయా నాయకులతో మాట్లాడారు. ఇక నుంచి ఎంపీటీసీ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు, బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించేందుకు పార్టీ తరఫున నిర్వహించాల్సిన కార్యక్రమాపై దృష్టి కేంద్రీకరించాలని ఆమె సూచించారు