Share News

Real Estate Dispute: కాపు కాచి.. కాల్చి చంపి..

ABN , Publish Date - Jul 16 , 2025 | 03:53 AM

కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ మెదక్‌ జిల్లా కార్యదర్శి మారెల్లి అనిల్‌ 28 దారుణ హత్యకు గురయ్యారు

Real Estate Dispute: కాపు కాచి.. కాల్చి చంపి..

  • కాంగ్రెస్‌ మెదక్‌ జిల్లా ఎస్సీ సెల్‌ నేత మారెల్లి అనిల్‌ దారుణ హత్య

  • సోమవారం రాత్రి మెదక్‌ జిల్లాలో ఘటన

  • అనిల్‌పైకి తుపాకీతో దుండగుల కాల్పులు

  • అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న కారు

  • తొలుత యాక్సిడెంట్‌గా భావించిన పోలీసులు

  • పోస్టుమార్టం సమయంలో బుల్లెట్‌ గాయాలు గుర్తించిన వైద్యులు

  • రియల్‌ ఎస్టేట్‌ వివాదాలే హత్యకు కారణమనే అనుమానాలు

మెదక్‌/ కొల్చారం, జూలై 15 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ మెదక్‌ జిల్లా కార్యదర్శి మారెల్లి అనిల్‌ (28) దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం హైదరాబాద్‌ గాంధీభవన్‌లో జరిగిన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ సమావేశానికి హాజరైన ఆయన.. తిరిగి వస్తుండగా మెదక్‌ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామ సమీపంలో దుండగులు కాల్చి చంపారు. అనిల్‌ నడుపుతున్న కారు కల్వర్టును ఢీకొని ఉండటంతో.. అది రోడ్డు ప్రమాదమని పోలీసులు తొలుత భావించారు. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు మృతదేహం దుస్తులు తొలగిస్తుండగా బుల్లెట్‌ గాయాలను గుర్తించారు. రియల్‌ ఎస్టేట్‌ వివాదాలే ఈ హత్యకు కారణం కావొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారమే అనిల్‌ పుట్టినరోజు అని, ఇలా శవమై తిరిగి వస్తాడని ఊహించలేదంటూ మెదక్‌ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్ద ఆయన తల్లి యేసమ్మ కన్నీరు మున్నీరయ్యారు.


పక్కాగా కాపుకాసి కాల్పులు

కొల్చారానికి చెందిన మారెల్లి అనిల్‌ సంగాయిపేటలో పెట్రోల్‌ బంక్‌ నడిపించడంతోపాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో భూములకు సంబంధించి పలువురితో అనిల్‌కు వివాదాలు ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఓ భూవివాదంలో ఏపీలోని రాయలసీమకు చెందిన ఓ వ్యక్తి కారును అనిల్‌ స్వాధీనం చేసుకున్నారని సమాచారం. అయితే అనిల్‌ సోమవారం హైదరాబాద్‌ గాంధీభవన్‌లో జరిగిన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ సమావేశానికి హాజరయ్యారు. రాత్రి తిరుగు ప్రయాణంలో ఉండగా హత్యకు గురయ్యారు. దుండగులు పక్కాగా రెక్కీ చేసి, పథకం ప్రకారం హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో ఓ కారుతో ఆగంతుకులు వేచి ఉన్నారని సమీపంలోని ఓ రైస్‌ మిల్లు సీసీ కెమెరా పుటేజీలలో గుర్తించారు. వారు అనిల్‌ కారును అడ్డగించి, నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి ఉంటారని అంచనా వేస్తున్నారు. అనిల్‌ తప్పించుకునే ఉద్దేశంతో కారును వేగంగా ముందుకు పోనివ్వడంతో ఎదురుగా ఉన్న కల్వర్టును ఢీకొని ఉంటారని చెబుతున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మెదక్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. దేహంలో నాలుగు బుల్లెట్లు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీనితో పోలీసులు క్లూస్‌టీం, ఫోరెన్సిక్‌ నిపుణులతో ఘటనా స్థలాన్ని పరిశీలించి, నాలుగు బుల్లెట్‌ కాట్రిజ్డ్‌లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఘటనా స్థలాన్ని ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, మెదక్‌ ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ కేసు దర్యాప్తు కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. కాగా, రాయలసీమతో పాటు హైదరాబాద్‌కు చెందిన పలువురు అనుమానితులను పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలిసింది. అనిల్‌ హత్యను కాంగ్రెస్‌ మెదక్‌ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, నియోజకవర్గ ఇన్‌చార్జి రాజిరెడ్డి ఖండించారు.

Updated Date - Jul 16 , 2025 | 03:53 AM