Congress Protest: తెలంగాణపై కేంద్రం వివక్ష
ABN , Publish Date - Aug 20 , 2025 | 04:30 AM
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని కాంగ్రెస్ ఎంపీలు ఆరోపించారు. మోదీ సర్కారు ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.
యూరియా ఇవ్వకుండా రైతులను
ఇబ్బంది పెడుతున్న మోదీ సర్కారు
పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల నిరసన
ధర్నాకు ప్రియాంకగాంధీ మద్దతు
న్యూఢిల్లీ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని కాంగ్రెస్ ఎంపీలు ఆరోపించారు. మోదీ సర్కారు ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. తెలంగాణకు యూరియా ఇవ్వాలని కోరుతూ పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీల నిరసన మంగళవారం కూడా కొనసాగింది. సభ ప్రారంభం కావడానికి ముందు పార్లమెంట్ ఆవరణలోని మకర్ ద్వారం వద్ద తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘురాంరెడ్డి, కడియం కావ్య, బలరాంనాయక్, వంశీకృష్ణ, అనిల్‌కుమార్ యాదవ్, రఘువీర్‌రెడ్డి, సురేశ్ షెట్కార్ సహా ఇతర ఇండియా కూటమి ఎంపీలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘మా వాటా మాకు ఇవ్వండి - తెలంగాణ రైతుల్ని కాపాడండి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ఆందోళనలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంకగాంధీ పాల్గొని మద్దతు తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ నిర్వహిస్తున్న యూరియా పోరాటానికి అండగా ఉంటానని ఆమె భరోసా ఇచ్చారు.
అనంతరం సభలో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ప్లకార్డు చేతబట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూరియా సమస్య పరిష్కారం కోసం ఢిల్లీలో ఆందోళన కార్యాచరణపై ఎంపీలతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. తెలంగాణకు యూరియా ఇవ్వాలంటూ నిరసన, ఆందోళన చేపడుతున్న రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర మంత్రులనూ కలిసి సమస్యలు వివరిస్తున్నారు. మంగళవారం కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు కాంగ్రెస్ ఎంపీలు వినతిపత్రం అందజేశారు. వారంలో 62 వేల మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణకు ఇస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు ఎంపీలు తెలిపారు.