కేటీఆర్‌ను అసెంబ్లీకి రానివ్వొద్దు
ABN , Publish Date - Mar 13 , 2025 | 04:46 AM
రాష్ట్ర అసెంబ్లీ, ముఖ్యమంత్రిని కించపరిచేలా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఢిల్లీలో మీడియాతో కాంగ్రెస్ ఎంపీలు
న్యూఢిల్లీ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అసెంబ్లీ, ముఖ్యమంత్రిని కించపరిచేలా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ను అసెంబ్లీ సమావేశాలకు రాకుండా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చర్యలు తీసుకోవాలని కోరారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, రామసహాయం రఘురామ్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు.
తొలుత మల్లు రవి మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగాన్ని అవమానించేలా కేటీఆర్ మాట్లాడారని తప్పుబట్టారు. కేటీఆర్ ప్రజాస్వామ్య విధానాలను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. 14 నెలలుగా అసెంబ్లీకి రాని వ్యక్తి దిశానిర్దేశం చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చామల అన్నారు. తెలంగాణను అప్పుల కుప్పగా చేసినందుకు కేసీఆర్ ప్రజలకు అసెంబ్లీ వేదికగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.