Share News

Congress: స్పీకర్‌గా ఓసీ ఉంటే అలాగే మాట్లాడేవారా?

ABN , Publish Date - Mar 14 , 2025 | 05:12 AM

స్పీకర్‌ చైర్‌లో ఓసీ ఉంటే.. జగదీశ్‌రెడ్డి అలా మాట్లాడుండేవారా? స్పీకర్‌నే నిలదీస్తారా? సభ నియామవళినీ పట్టించుకోకుండా వాదనకు దిగుతారా? ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందే’ అంటూ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌కు కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

Congress: స్పీకర్‌గా ఓసీ ఉంటే అలాగే మాట్లాడేవారా?

  • సభాపతితోనే వాదనా?

  • జగదీశ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందే: కాంగ్రెస్‌

  • ఆ వ్యాఖ్యల్లో అన్‌పార్లమెంటరీ పదాలు లేవు

  • స్పీకర్‌ను అవమానించినట్లైతే జగదీశ్‌ విచారం తెలుపుతారు

  • సభాపతికి హరీశ్‌ ప్రతిపాదన సస్పెన్షన్‌ ముందు హైడ్రామా

హైదరాబాద్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ‘‘స్పీకర్‌ చైర్‌లో ఓసీ ఉంటే.. జగదీశ్‌రెడ్డి అలా మాట్లాడుండేవారా? స్పీకర్‌నే నిలదీస్తారా? సభ నియామవళినీ పట్టించుకోకుండా వాదనకు దిగుతారా? ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందే’’ అంటూ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌కు కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. శాసనసభలో గురువారం ఉదయం స్పీకర్‌, జగదీశ్‌రెడ్డి మధ్య సంవాదం నేపథ్యంలో సభ 15 నిమిషాల పాటు వాయిదా పడింది. అయితే అప్పటి నుంచీ మూడున్నర గంటల పాటు స్పీకర్‌ కార్యాలయంలో హైడ్రామా నడిచింది. తొలుత స్పీకర్‌ కార్యాలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌బాబు, కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు.. సభలో జగదీశ్‌రెడ్డి వ్యవహార శైలిని తప్పు పట్టారు. ఆయన వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయని, స్పీకర్‌ చైర్‌లో ఓసీ వ్యక్తి ఉంటే.. జగదీశ్‌ రెడ్డి అలా నిలదీసే స్థాయికి వెళ్లి ఉండేవారు కాదని పలువురు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. ఆయన శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలనీ, ఈ మేరకు తీర్మానాన్ని సభలో ప్రతిపాదిస్తామనీ పట్టు పట్టారు. ఆ సమయంలోనే బీఆర్‌ఎస్‌ సభ్యులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్‌ తదితరులు అక్కడికి చేరుకున్నారు. చాంబర్లో స్పీకర్‌తో విడిగా మాట్లాడిన వారు.. జగదీశ్‌ రెడ్డి వ్యాఖ్యల్లో అన్‌ పార్లమెంటరీ పదం ఏదీ లేదన్నారు. ఆయన వ్యాఖ్యల్లో కావాలని చేసినవి ఏవీ లేవన్నారు. స్పీకర్‌ చైర్‌ను అవమానించినట్లుగా భావించిన పక్షంలో.. సభాముఖంగా జగదీశ్‌రెడ్డి విచారం వ్యక్తం చేస్తారని ప్రతిపాదించారు. స్పీకర్‌తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన హరీశ్‌.. జగదీశ్‌ రెడ్డి స్పీకర్‌ను అవమానించలేదని స్పష్టం చేశారు. ‘‘సభ ‘మీ’ ఒక్కరిది కాదు.. అందరిది అన్నారు. ‘మీ’ అనే పదం అన్‌ పార్లమెంటరీ పదం కాదు. దానిపై కాంగ్రెస్‌ సభ్యులు ఎందుకు నిరసన తెలుపుతున్నారో తెలియదు’’అని వ్యాఖ్యానించారు. స్పీకర్‌ను కలిసి.. సభలోజగదీశ్‌రెడ్డి మాట్లాడిన వీడియో రికార్డు ఇవ్వాలని కోరినట్టు తెలిపారు.


వ్యాఖ్యల రికార్డు పరిశీలన..

డిప్యూటీ సీఎం భట్టి, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, మంత్రి ఉత్తమ్‌ తదితరులు.. సభలో జగదీశ్‌రెడ్డి స్పీకర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల రికార్డును పరిశీలించారు. దీనిపై వారు ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డితోనూ మాట్లాడినట్టు సమాచారం. అలాగే.. భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు పలు మార్లు దీనిపై స్పీకర్‌తో భేటీ అయి చర్చలు జరిపారు. స్పీకర్‌ చైర్‌ను అవమానించేలా మాట్లాడిన జగదీశ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చి.. సస్పెన్షన్‌ వేటు వేస్తూ తీర్మానాన్ని ప్రతిపాదించి.. సభ ఆమోదం తీసుకున్నారు.


బీఆర్‌ఎ్‌సఎల్పీ కార్యాలయంలోకి చీఫ్‌ మార్షల్‌

సస్పెన్షన్‌ వేటు పడిన అనంతరం.. జగదీశ్‌రెడ్డి సభ నుంచి బయటికి వచ్చి లాబీల్లోని బీఆర్‌ఎ్‌సఎల్పీ ఆఫీసులోకి వెళ్లారు. దీంతో చీఫ్‌ మార్షల్‌ కొంతమంది మార్షల్స్‌తో కలిసి అక్కడికి వెళ్లి.. సస్పెన్షన్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అసెంబ్లీ పరిధిలోనే ఉన్న ఆ కార్యాలయాన్నీ వీడి వెళ్లాల్సిందిగా జగదీశ్‌ రెడ్డిని కోరారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన కేటీఆర్‌, హరీశ్‌రావు.. చీఫ్‌ మార్షల్‌ తీరును తప్పు పట్టారు.

Updated Date - Mar 14 , 2025 | 05:12 AM