Congress: బీజేపీ, ఎంఐఎం ఒకే నాణేనికి బొమ్మ, బొరుసులు
ABN , Publish Date - Aug 13 , 2025 | 05:28 AM
బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒకే నాణేనికి బొమ్మ, బొరుసులాంటివని కాంగ్రెస్ పార్టీ నాంపల్లి నియోజకవర్గ ఇంచార్జి ఫిరోజ్‌ఖాన్ అన్నారు.
ఓటు చోరీ అంశంపై ఫిరోజ్ ఖాన్
హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒకే నాణేనికి బొమ్మ, బొరుసులాంటివని కాంగ్రెస్ పార్టీ నాంపల్లి నియోజకవర్గ ఇంచార్జి ఫిరోజ్‌ఖాన్ అన్నారు. హైదరాబాద్‌లో ఎంఐఎం పార్టీ చేస్తున్నట్లుగానే దేశంలో బీజేపీ ఓట్లను చోరీ చేస్తోందని ఆయన ఆరోపించారు. నాంపల్లిలో నకిలీ ఐడీలతో దొంగ ఓట్లు వేస్తున్న అసదుద్దీన్ ఒవైసీ మనుషులను గతంలో పట్టుకొని ఈసీకి ఫిర్యాదు చేశామని, అయినా పట్టించుకోలేదని అన్నారు. ఎంఐఎం దొంగ ఓట్లపైన తాము ఐదేళ్లు కొట్లాడితే చనిపోయిన వారి పేర్లను మాత్రం తీసేశారన్నారు.
నాంపల్లిలో ఓటు చోరీపైన తనవద్ద అన్ని అధారాలు ఉన్నాయని, కావాలంటే ఈసీకి డిక్లరేషన్ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఓటు చోరీ అంశాన్ని రాహుల్‌గాంధీ వెలుగులోకి తీసుకురావడం సంతోషకరమని అన్నారు. బీజేపీకి బీ టీమ్ అసదుద్దీన్ ఒవైసీ అని, ఓల్డ్ సిటీని చెత్తబుట్టగా మార్చిన ఆయనకు బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డును ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.