Share News

BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీకి ఉద్యమబాట

ABN , Publish Date - Aug 05 , 2025 | 04:52 AM

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సాధించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీ బాట పట్టింది. దేశ రాజధానిలో ఉద్యమానికి సిద్ధమైంది.

BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీకి ఉద్యమబాట

  • నేడు దేశ రాజధానికి సీఎం, కాంగ్రెస్‌ శ్రేణులు

  • రేపు జంతర్‌మంతర్‌ వద్ద మహాధర్నా

న్యూఢిల్లీ, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సాధించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీ బాట పట్టింది. దేశ రాజధానిలో ఉద్యమానికి సిద్ధమైంది. టీపీసీసీ ఇప్పటికే మూడు రోజుల కార్యాచరణ ప్రకటించింది. మంగళవారం పార్లమెంట్‌లో వాయిదా తీర్మానం ఇవ్వాలని, 6న జంతర్‌ మంతర్‌లో మహాధర్నా నిర్వహించాలని, 7న రాష్ట్రపతిని కలిసి విన్నవించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సోమవారం 1,400 మందితో హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైలు బయలుదేరింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రికి ఢిల్లీ చేరుకోనున్నారు. ఆయనతోపాటు టీపీసీసీ చీఫ్‌, మంత్రులందరూ రానున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, టీపీసీసీ, డీసీసీ బాధ్యులు, వివిధ సంఘాల నేతలు అందరూ ఢిల్లీకి రావాలని పార్టీ ఆదేశించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలపడంతో తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపారు. ఈ నేపథ్యంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో నేతలు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించాలని టీపీసీసీ భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబరు నెలాఖరులోపు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించగా.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని రేవంత్‌ సర్కారు ప్రకటించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, రిజర్వేషన్లు సాధించుకోవాలని సీఎం రేవంత్‌ కృతనిశ్చయంతో ఉన్నారు. ఆ మేరకు రాహుల్‌ నేతృత్వంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఓబీసీ ధర్నాకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ సహా వంద మంది కాంగ్రెస్‌ ఎంపీలతో పాటు ఇతర పార్టీల నేతలు హాజరు కానున్నారు.


వాయిదా తీర్మానం ఇచ్చాం: మల్లు రవి

తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు 29 నుంచి 42 శాతానికి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా అన్ని చర్యలు తీసుకుందని, ఇక రాష్ట్రపతి ఆమోదమే ఆలస్యమని కాంగ్రెస్‌ ఎంపీల ఫోరం రాష్ట్ర కన్వీనర్‌ మల్లు రవి తెలిపారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీలకు న్యాయం చేయడంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. ‘‘42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చాం. కానీ, సభ వాయిదా పడడంతో ప్రస్తావనకు రాలేదు. మంగళవారం తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలంతా కలిసి మరోసారి వాయిదా తీర్మానం ఇస్తాం. 6న సీఎం, మంత్రులు, నేతలంతా కలిసి జంతర్‌మంతర్‌లో ధర్నా చేస్తాం. ఈ ధర్నాకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ధర్నాకు ఖర్గే, రాహుల్‌, ప్రియాంక, కేసీ వేణుగోపాల్‌ సహా వంద మంది కాంగ్రెస్‌ ఎంపీలతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా హాజరవుతారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 42 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో ముస్లింల్లో వెనకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు మాత్రం వ్యతిరేకించడం లేదు. మేం తప్పకుండా బీసీ రిజర్వేషన్లు సాధించి తీరతాం’’ అని మల్లు రవి చెపాపరు. కాగా, ప్రధాని మోదీ నేతృత్వంలోనే ఓబీసీ రిజర్వేషన్లు సాధించి తీరతామని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. సోమవారం ఢిల్లీలో అఖిల భారత ఓబీసీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఆరు దశాబ్దాల కాంగ్రెస్‌ పాలనలో వివక్షకు గురైన ఓబీసీలకు బీజేపీ న్యాయం చేస్తోందన్నారు. ప్రధానిగా, రాష్ట్రపతిగా ఓబీసీలకు సముచిత స్థానం కల్పించిన ఘనత బీజేపీదేనని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరం నివేదికపై ఆరోపణలు.. బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం

కవితకు షాక్ ఇచ్చిన కోర్టు

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 05 , 2025 | 04:52 AM