Hyderabad: వాణిజ్య పన్నుల అదనపు కమిషనర్‌పై ఫిర్యాదు
ABN , Publish Date - Jul 15 , 2025 | 04:25 AM
ఆబిడ్స్ డివిజన్‌ను పర్యవేక్షిస్తున్న వాణిజ్య పన్నుల అదనపు కమిషనర్ లావణ్యపై అదే డివిజన్‌లోని బషీర్‌బాగ్ ఒకటి, రెండో నెంబర్ సర్కిళ్లలో పని చేస్తున్న అసిస్టెంట్ కమిషనర్లు..
వాణిజ్య పన్నుల కమిషనర్‌కు, పోలీసులకు అసిస్టెంట్ కమిషనర్లు ఫిర్యాదు
హైదరాబాద్, జూలై 14(ఆంధ్రజ్యోతి): ఆబిడ్స్ డివిజన్‌ను పర్యవేక్షిస్తున్న వాణిజ్య పన్నుల అదనపు కమిషనర్ లావణ్యపై అదే డివిజన్‌లోని బషీర్‌బాగ్ ఒకటి, రెండో నెంబర్ సర్కిళ్లలో పని చేస్తున్న అసిస్టెంట్ కమిషనర్లు కె.శ్రీనివాస్, జి.వేణుగోపాల్‌రెడ్డి రాష్ట్ర వాణిజ్య పన్నుల కమిషనర్‌కు, ఆబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీఎ్‌సటీ వసూలు చేయాలంటూ ఒకసారి, వద్దంటూ మరోసారి తమను ఆదేశిస్తున్నారని వారు ఆరోపించారు. విధులను నిర్వహించనీయడంలేదని, బెదిరింపులకు పాల్పడుతున్నారని కమిషనర్‌కు వివరించారు.
ఈ ఫిర్యాదుపై మరో 20 మంది కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు కూడా సంతకాలు చేశారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తమ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని, అసభ్యంగా మాట్లాడుతున్నారని, రాయలేని పదాలను వాడుతున్నారని ఆరోపించారు. సెలవు నుంచి వచ్చిన తర్వాత తాను అడిషనల్ కమిషనర్‌ను కలవడానికి ప్రయత్నిస్తే ఆమె తిరస్కరిస్తున్నారని వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఈనెల 10న జరిగిన అసిస్టెంట్ కమిషనర్ల సమావేశంలో తాను ముందు వరుసలో కూర్చుంటే వెనక సీట్లలోకి వెళ్లాలంటూ లావణ్య అవమానించారని ఆయన ఆరోపించారు. ఆబిడ్స్ డివిజన్‌లో రూ.875 కోట్ల పన్ను బకాయిలు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.