Indiramma Housing Festival in Tribal Village: గిరిజన గ్రామంలో.. ఇందిరమ్మ ఇళ్ల పండుగ
ABN , Publish Date - Sep 03 , 2025 | 04:08 AM
అది మారుమూల ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామం. అంతా ఏళ్ల తరబడి గుడిసెల్లో జీవనం సాగిస్తున్న గిరిజనులే...
పైలట్ గ్రామంలో నేడు గృహప్రవేశ ఉత్సవం
భద్రాద్రి జిల్లా బెండాలపాడులో కార్యక్రమం
ఇళ్ల ప్రారంభోత్సవం చేయనున్న సీఎం
కొత్తగూడెం, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): అది మారుమూల ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామం. అంతా ఏళ్ల తరబడి గుడిసెల్లో జీవనం సాగిస్తున్న గిరిజనులే. పక్కా ఇళ్లు కట్టుకునే స్థోమతలేని వీరంతా ఇప్పుడు ‘ఇందిరమ్మ ఇంటివారు’ అవుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా గృహప్రవేశ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో బెండాలపాడు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు మంజూరు చేసింది. మండలం మొత్తానికి 968 ఇళ్లను మంజూరు చేయగా.. ఇందులో బెండాలపాడుకే 310 ఇళ్లను కేటాయించారు. వాటిలో 58 ఇళ్లు స్లాబులు పూర్తికాగా, 86 ఇళ్లు రూఫ్ లెవల్, 150 ఇళ్లు బేస్‌మెంట్ లెవల్‌లో ఉన్నాయి. రాష్ట్రంలోనే అతి తక్కువ కాలంలో అత్యధిక ఇళ్లను పూర్తి చేసిన గ్రామం ఇదే. కాగా, బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఈ గ్రామానికి వచ్చి ఇళ్లను ప్రారంభించనున్నారు. హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 2.20 గంటలకు సీఎం బెండాలపాడుకు చేరుకుంటారు. గ్రామంలోని బచ్చల నర్సమ్మ, బచ్చల రమణ అనే లబ్ధిదారులకు చెందిన ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొంటారు. పలువురు లబ్ధిదారులతో మాట్లాడతారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పైలాన్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత దామరచర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
గిరిజనగ్రామానికి చారిత్రక ఘట్టం:పొంగులేటి
మారుమూల గిరిజన ప్రాంతమైన బెండాలపాడుకు ముఖ్యమంత్రి రావడం ఒక చారిత్రక ఘట్టమని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇది ఆ గ్రామ ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అవుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల ఏర్పాట్లను మంగళవారం మంత్రి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నుంచి గృహనిర్మాణ శాఖను బలోపేతం చేస్తూ, పేదవారికి న్యాయం జరిగేలా పారదర్శక విధానంలో ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. లబ్థిదారుల ఎంపిక నుంచి వారి ఖాతాల్లో నిధుల జమ వరకు మొత్తం ప్రక్రియలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామన్నారు. ఎక్కడైనా అవకతవకలు జరిగితే వెంటనే గుర్తించి, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
నేడు దేవరకద్రకు సీఎం రేవంత్‌రెడ్డి
మహబూబ్‌నగర్: సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మూసాపేట మండలంలో ఉన్న కార్నింగ్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ యూనిట్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. అనంతరం అక్కడి ముఖ్య కార్యకర్తలతో సమావేశమవుతారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మూసాపేటలో కార్యక్రమం అనంతరం భద్రాద్రి కొత్తగూడెం పర్యటనకు వెళ్లనున్నారు.
ఇవి కూడా చదవండి..
దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..
ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..