Share News

CM Revanth: పదేళ్ల పాలకులు.. నమ్మక ద్రోహులు

ABN , Publish Date - Sep 28 , 2025 | 02:15 AM

తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లపాటు పాలించిన బీఆర్‌ఎస్‌ నేతలు.. ప్రజలకు నమ్మకద్రోహం చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. జీవితాలను బాగు చేస్తారని ప్రజలు ఓటేస్తే.. రాష్ట్రాన్ని కొల్లగొట్టారని, కొలువులు ఇస్తారని ...

CM Revanth: పదేళ్ల పాలకులు.. నమ్మక ద్రోహులు

  • అధికారమిస్తే నిరుద్యోగులను నట్టేట ముంచారు

  • పదేళ్లలో గ్రూప్‌-1 నిర్వహించలేని అసమర్థులు

  • మేం ప్రకటిస్తే.. కడుపులో విషంతో అడ్డుకునే కుట్ర

  • 40 ఏళ్లలో చేయనిది 19 నెలల్లో పూర్తిచేశాం

  • గ్రూప్‌-1 అధికారులుగా బాధ్యతతో ఉండండి

  • తెలంగాణ అంటే ఏంటో దేశానికి చూపించండి

  • తల్లిదండ్రులను విస్మరిస్తే జీతంలో కోత: సీఎం

  • 562 మందికి నియామక పత్రాల అందజేత

  • పర్యాటకంలో పెట్టుబడులు పెట్టండి లాభాలు తెప్పించే బాధ్యత తీసుకుంటాం

  • పర్యాటక సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి

  • రూ.15,279 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు

  • తుమ్మిడిహెట్టిపై వచ్చే నెలలో మహారాష్ట్రకు సీఎం!

  • ఒకట్రెండు రోజుల్లో గ్రూప్‌-2 తుది జాబితా!

హైదరాబాద్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లపాటు పాలించిన బీఆర్‌ఎస్‌ నేతలు.. ప్రజలకు నమ్మకద్రోహం చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. జీవితాలను బాగు చేస్తారని ప్రజలు ఓటేస్తే.. రాష్ట్రాన్ని కొల్లగొట్టారని, కొలువులు ఇస్తారని నిరుద్యోగులు అధికారం కట్టబెడితే.. వారిని నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. కొలువులన్నీ కేవలం ఒక్క కుటుంబానికే దక్కాయన్నారు. నియామకాల కోసం సాధించుకున్న రాష్ట్రంలో.. పదేళ్లలో కనీసం ఒక్క గ్రూప్‌-1 కూడా నిర్వహించలేని అసమర్థత కేసీఆర్‌ ప్రభుత్వానిదని మండిపడ్డారు. శనివారం శిల్పారామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి.. ఇటీవల గ్రూప్‌-1 అధికారులుగా ఎంపికైన 562 మందికి సీఎం నియామక పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. రెండు పర్యాయాలు అధికారంలో ఉండి సాధించలేని విజయాన్ని తాము సాధిస్తున్నామన్న అక్కసుతో, కడుపులో విషం పెట్టుకుని ఫలితాలను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. నోటిఫికేషన్‌ నుంచి ఫలితాల ప్రకటన దాకా.. అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. ఒక్కో పోస్టుకు రూ.2 కోట్లు, రూ.3 కోట్లు తీసుకుని ఉద్యోగాలిచ్చామంటూ ఆరోపించారని, లక్షల రూపాయలు ఖర్చుచేసి పెద్ద పెద్ద న్యాయవాదులను నియమించుకున్నారని చెప్పారు. నియామకాలు పూర్తయితే తమకు వ్యాపారం ఉండదన్న దురుద్దేశంతో అశోక్‌నగర్‌లోని కొన్ని కోచింగ్‌ సెంటర్లు ప్రతిపక్షాలకు మద్దతుగా నిలిచాయని విమర్శించారు. అయితే.. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. తనకు గ్రూప్‌-1 అభ్యర్థుల భవిష్యత్తు మాత్రమే కనిపించిందన్నారు.


ఇట్లుంటది తెలంగాణ..

‘‘కొంతమంది అప్పుడప్పుడు తెలంగాణ ఎక్కడున్నది? తెలంగాణ ఎట్లుంటది? అని అడుగుతున్నరు. వారందరికీ ఇక్కడి నుంచే చెబుతున్నా. తెలంగాణ ఇక్కడే ఉంది.. ఇట్లుంటది తెలంగాణ. ఇదే తెలంగాణ స్ఫూర్తి, తెలంగాణ చైతన్యం, తెలంగాణ భవిష్యత్తు’’ అని సీఎం రేవంత్‌ అన్నారు. తెలంగాణ గడ్డపై ప్రజలను మోసగించినోళ్లు చరిత్రలో కలిసిపోయారని చెప్పారు. అయినా.. కొంత మంది తాము కారణ జన్ములమని, తమ కుటుంబమే తెలంగాణ అని భావించారని పరోక్షంగా కేసీఆర్‌ కుటుంబాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చివరికి వారు తెలంగాణ చరిత్రలో నమ్మకద్రోహులుగా నిలిచిపోయారన్నారు. పదేళ్లుగా గ్రూప్‌-1 పరీక్షలు నిర్వహించకుండా బాధ్యతారహితంగా వ్యవహరించారని, శ్రీకాంతచారి, యాద య్య, ఇషాన్‌రెడ్డి లాంటి వాళ్ల త్యాగాలను అపహాస్యం చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఆర్‌ఎంపీ వైద్యులను టీజీపీఎస్సీలో సభ్యులుగా నియమించారని, దానిని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని రేవంత్‌ ధ్వజమెత్తారు. గ్రూప్‌-1 లాంటి రాష్ట్ర ఉన్నత ఉద్యోగులను నియమించే కమిషన్‌లో చిన్నపాటి ఉద్యోగులు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. అందుకే గ్రూప్‌-1 ప్రశ్నపత్రాలు లీకయ్యాయని, జిరాక్స్‌ సెంటర్‌లో బయటపడ్డాయని అన్నారు. టీజీపీఎస్సీని యూపీఎస్సీ స్థాయిలో ప్రక్షాళన చేస్తామని తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చేసి చూపించామన్నారు. డీజీపీగా పనిచేసిన వ్యక్తిని కమిషన్‌ చైర్మన్‌గా నియమించామని గుర్తు చేశారు. గత 40 ఏళ్లలో సాధించని దానిని.. తాము కేవలం 19 నెలల్లోనే గ్రూప్‌-1 పూర్తిచేసి చూపించామన్నారు.

4 కోట్ల ప్రజల అభివృద్ధే లక్ష్యం కావాలి..

‘‘ఇక నుంచి తెలంగాణ యంత్రాంగాన్ని నడిపించే బాధ్యత మీపై ఉంది. మనమంతా కలిసి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అవుదాం. దేశానికి కావాల్సింది గుజరాత్‌ మోడల్‌ కాదు.. తెలంగాణ మోడల్‌. మనమేంటో సత్తా చూపించాలి. నిన్నటివరకు మీరు నిరుద్యోగులు. రేపటి నుంచి ఆఫీసర్లు. అధికారులుగా బాధ్యతగా వ్యవహరించాలి. 4 కోట్ల ప్రజల అభివృద్దే లక్ష్యంగా ఉండాలి’’ అని గ్రూప్‌-1 విజేతలనుద్దేశించి సీఎం రేవంత్‌ అన్నారు. ఉద్యోగం సాధించిన వారికి, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. తెలంగాణ భవిష్యత్తు నిర్మాణం చేసేందుకు సహకారం అందించాలని కోరారు. ‘‘మీ భవిష్యత్తు కోసం శ్రమించిన తల్లిదండ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత మీదే. మీకోసం వారి జీవితాన్ని త్యాగం చేశారు. తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం వహి స్తే మీ జీతాల్లో నుంచి 10శాతం కట్‌ చేసి.. వారి ఖాతాల్లో వేస్తాం. దీనికి సంబంధించి త్వరలో చట్టం తేబోతున్నాం’’ అని సీఎం అన్నారు. అనంతరం గ్రూప్‌-1 విజేతలకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారంతా సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మీ పట్టుదలతోనే మా కల సాకారమైంది’’ అని పలువురు తీవ్ర భావోద్వేగంతో అన్నారు. సమావేశం తర్వాత సీఎం వెలుపలికి వస్తున్నప్పుడు కొందరు తల్లిదండ్రులు సీఎంను కలిసి పాదాభివందనం చేయబోగా.. ఆయన అడ్డుకున్నారు.


ఐటీఐలలో ఏటీసీ కేంద్రాలు ప్రారంభం

మహబూబ్‌నగర్‌/అల్వాల్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఐటీఐలతోపాటు హైదరాబాద్‌ నగరంలోని అల్వాల్‌ ఐటీఐలో శనివారం అధునాతన సాంకేతిక కేంద్రాలు (ఏటీసీలు) ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడి మల్లేపల్లిలోని ఐటీఐ ప్రాంగణం నుంచి వర్చువల్‌గా వీటిని ప్రారంభించారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో, నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తిలో, అమ్రాబాద్‌ మండలం మన్ననూరులో, వనపర్తిలోని నాగవరం శివారులో ఉన్న ఐటీఐలలో ఈ కేంద్రాలను ప్రారంభించగా.. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. మరోవైపు అల్వాల్‌ ఐటీఐ ప్రాంగణంలో టాటా టెక్నాలజీస్‌ సహకారంతో రూ.6.76 కోట్లతో నిర్మించిన ఏటీసీని ప్రారంభించారు.

Updated Date - Sep 28 , 2025 | 02:15 AM