Khairatabad Maha Ganapathi: ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి..
ABN , Publish Date - Sep 05 , 2025 | 01:12 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు ఖైరతాబాద్ వినాయకుణ్ని దర్శించుకున్నారు. బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు.
హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి రేపు(శనివారం) గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు ఖైరతాబాద్ వినాయకుణ్ని దర్శించుకున్నారు. బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ 71 ఏళ్ల క్రితం ఒకే ఒక్క అడుగుతో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించింది. ఆనాడు ప్రారంభమైన గణేష్ ఉత్సవాలు ఈ నాటికి 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. గణేష్ ఉత్సవాలంటే.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలని దేశ ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఎన్ని కష్టాలు వచ్చినా.. నష్టాలు వచ్చినా అన్నింటిని భరించుకుంటూ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను నిర్వహించినందుకు ఉత్సవ కమిటీలోని ప్రతి ఒక్కరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దేశంలో ఎక్కడా లేని విధంగా గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలను నిర్వహించుకున్నాం. మహా గణపతి నిమజ్జనానికి ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మత సామరస్యానికి హైదరాబాద్ నగరం గొప్ప ఉదాహరణ. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు తెలంగాణకి మంచి పేరు తెచ్చి పెట్టాయి’ అని అన్నారు.
కాగా, ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకోవడానికి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జర్మనీకి చెందిన బేబిగ్ మెడికల్ కంపెనీ చైర్మన్, సీఈవో జార్జ్ చాన్ ప్రతినిధి బృందం కలిసింది. తెలంగాణలో మెడికల్ పరికరాల ఉత్పత్తి యూనిట్‌ను ప్రారంభించడానికి ఆసక్తి చూపుతున్నట్లు జర్మన్ కంపెనీ తెలిపింది. ఇందుకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అనువైన స్థలం, ఇతర అంశాలకు సంబంధించి అధ్యయనం చేసి రిపోర్టు అందించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెడికల్ పరికరాలతోపాటు, క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడే రేడియేషన్ సెంటర్స్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ ప్రతినిధులను సీఎం కోరారు.
ఇవి కూడా చదవండి
జగన్ అసెంబ్లీకి రాకపోతే పులివెందులకు బై ఎలక్షన్ ఖాయం:రఘురామ
లేదులేదు.. ఆయన్ని నేనేం విమర్శించలేదు..