Share News

CM Revanth Reddy: జహీరాబాద్‌ స్మార్ట్‌ సిటీకిడబ్బులివ్వండి

ABN , Publish Date - Jul 09 , 2025 | 03:55 AM

జహీరాబాద్‌ పారిశ్రామిక స్మార్ట్‌ సిటీ అభివృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌కు విజ్ఞప్తి చేశారు.

CM Revanth Reddy: జహీరాబాద్‌ స్మార్ట్‌ సిటీకిడబ్బులివ్వండి

  • కేంద్రం ఆమోదించిన 596 కోట్లు విడుదల చేయండి

  • వరంగల్‌ విమానాశ్రయానికి ఆర్థిక చేయూత

  • హైదరాబాద్‌-బెంగళూరు ఏరో డిఫెన్స్‌ కారిడార్‌.. తెలంగాణకు సకాలంలో యూరియా దేశీయ ఉత్పత్తిలో రాష్ట్రం కోటా పెంచండి.. కేంద్ర మంత్రులు గోయల్‌, నడ్డాలకు సీఎం వినతి

న్యూఢిల్లీ, జూలై 8 (ఆంధ్రజ్యోతి): జహీరాబాద్‌ పారిశ్రామిక స్మార్ట్‌ సిటీ అభివృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన ఢిల్లీలోని వాణిజ్య భవన్‌లో కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. ఈ స్మార్ట్‌ సిటీ అభివృద్ధికోసం జాతీయ పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి, అమలు ట్రస్ట్‌ (ఎన్‌ఐసీడీఐటీ) ఆమోదించిన రూ.596.61 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. స్మార్ట్‌ సిటీకి అవసరమైన నీటి సరఫరా, విద్యుత్‌, ఇతర వసతుల కల్పనకు ఆర్థిక సహాయం చేయాలన్నారు. హైదరాబాద్‌-వరంగల్‌ పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా వరంగల్‌ విమానాశ్రయానికి నిధులు మంజూరు చేయాలని అభ్యర్ధించారు. హైదరాబాద్‌-విజయవాడ పారిశ్రామిక కారిడార్‌ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నామని కేంద్ర మంత్రికి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఆదిభట్లలో అత్యున్నతమైన మౌలిక వసతులతో ప్రత్యేకమైన రక్షణ, ఏరోస్పేస్‌ పార్కును ఏర్పాటు చేసిందని, హైదరాబాద్‌ బెంగళూర్‌ పారిశ్రామిక కారిడార్‌ను ఏరో డిఫెన్స్‌ కారిడార్‌గా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న వంద ప్లగ్‌ అండ్‌ ప్లే పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పిస్తామని, కేంద్ర ప్రభుత్వం వాటికి మద్దతుగా నిలవాలని కోరారు.

rth.jpg


సకాలంలో యూరియా సరఫరా చేయండి

తెలంగాణ అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర ఎరువుల మంత్రి జేపీ నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో ఆయన్ను అధికారిక నివాసంలో కలిశారు. వర్షాకాలానికి సంబంధించి ఏప్రిల్‌-జూన్‌ మధ్య 5 లక్షల మెట్రిక్‌ టన్నులకు గాను కేవలం 3.07 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే సరఫరా చేశారని తెలిపారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు నీరు రావడంతో సాగు పనులు జోరుగా సాగుతున్నాయని, యూరియా సరఫరాలో ఆటంకాలు తలెత్తకుండా చూడాలని కోరారు. జూలై నెలలో 1.6 లక్షల టన్నులు తెలంగాణకు సరఫరా చేయాల్సి ఉండగా, కేవలం 29 వేల మెట్రిక్‌ టన్నులు సరఫరా చేశారని వివరించారు. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న యూరియా కోటాను తెలంగాణకు పెంచాలని కోరారు. యూరియా సరఫరాకు రైల్వే శాఖ తగిన రాక్‌లు కేటాయించడం లేదని, వాటి సంఖ్య పెంచాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి, ఎంపీలు డాక్టర్‌ మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్‌ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, కేంద్ర పథకాల సమన్వయ కార్యదర్శి డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో వైఎస్‌ది చెరగని ముద్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమం విషయంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎ్‌స.రాజశేఖర్‌రెడ్డి చెరగని ముద్ర వేశారని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కొనియాడారు. మంగళవారం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో వై.ఎస్‌. జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి సీఎం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, జలయజ్ఞం, ఔటర్‌ రింగు రోడ్డు, పింఛన్ల పెంపు వంటి కార్యక్రమాలతో ఉమ్మడి రాష్ట్ర ప్రజల్లో వైఎస్‌ శాశ్వతంగా నిలిచిపోయారన్నారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయాలని వైఎస్‌ చెప్పేవారని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కూడా నివాళులర్పించారు.

Updated Date - Jul 09 , 2025 | 06:33 AM