Share News

అధికారికంగా రోశయ్య జయంతి

ABN , Publish Date - Jul 04 , 2025 | 04:18 AM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన 92వ జయంతి.

అధికారికంగా రోశయ్య జయంతి

  • సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు

  • నేడు హైదరాబాద్‌లో రోశయ్య విగ్రహావిష్కరణ

హైదరాబాద్‌/ అమీర్‌పేట, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన 92వ జయంతి. తమ ప్రభుత్వం ఆయనకు అరుదైన గౌరవం కల్పించిందని పేర్కొన్నారు. రోశయ్య జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి ఆయనను స్మరించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 16 సార్లు ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్య దక్కించుకున్నారని గురువారం తెలిపారు. ఆయన 50 ఏళ్లు క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా ఉన్నా.. వివాద రహితుడిగా పేరు పొందారని సీఎం పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత తమిళనాడు గవర్నర్‌గా రోశయ్య సేవలు అందించారని సీఎం రేవంత్‌ రెడ్డి గుర్తు చేశారు.


కాగా, 450 కిలోల రోశయ్య విగ్రహాన్ని లక్డీకాపూల్‌ చౌరస్తాలో శుక్రవారం ఉదయం 9.30 గంటలకు మైట్రో రైల్వే స్టేషన్‌ సమీపాన పాత సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద సీఎం రేవంత్‌ రెడ్డి ఆవిష్కరిస్తారు. ఈ నేపథ్యంలో ఆయన విగ్రహావిష్కరణ ఏర్పాట్లను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ తదితర అధికారులు సమీక్షించారు. రోశయ్య ఆయన విగ్రహం ఏర్పాటుకు సీఎం రేవంత్‌ చొరవ చూపడంపై డాక్టర్‌ కొణిజేటి రోశయ్య స్మారక వేదిక హర్షం వ్యక్తం చేసింది. వేదిక సభ్యులు కామిశెట్టి అనిల్‌ కుమార్‌, ఫెడరేషన్‌ ఆఫ్‌ అవొపాస్‌ జాతీయ అధ్యక్షుడు సీఏ బెల్ది గురువారం రోశయ్య నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. అతి తక్కువ సమయంలోనే ఆయన విగ్రహం తయారు చేయడంతోపాటు ఆవిష్కరిస్తున్నందుకు వైశ్యులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ కాల్వ సుజాత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2025 | 04:18 AM