Telangana Cabinet Expansion: తొలిసారి.. తీన్మార్
ABN , Publish Date - Jun 09 , 2025 | 04:01 AM
క్యాబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆరు స్థానాల్లో.. తొలి విడతగా మూడింటిని భర్తీ చేశారు. మూడు బెర్తులనూ తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికే కట్టబెట్టారు. ఈ మేరకు ముగ్గురు కొత్త మంత్రులు ఆదివారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్ దర్బార్ హాల్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నూతన మంత్రులతో ప్రమాణం చేయించారు.
ముగ్గురితో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ.. ప్రమాణ స్వీకారం చేసిన నూతన మంత్రులు
రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా కార్యక్రమం
గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరితో
ప్రమాణం చేయుంచిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
హాజరైన సీఎం రేవంత్, మంత్రులు, పీసీసీ చీఫ్,
శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్, నేతలు
9 నిమిషాల్లోనే ముగిసిన ప్రమాణ స్వీకారం
రేవంత్ క్యాబినెట్‌లో 14కు చేరిన మంత్రుల సంఖ్య
స్థానిక ఎన్నికల తర్వాత మిగిలిన 3 ఖాళీల భర్తీ!
హైదరాబాద్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): సుదీర్ఘకాలంగా వాయిదా పడుతూ వచ్చిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు జరిగింది. క్యాబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆరు స్థానాల్లో.. తొలి విడతగా మూడింటిని భర్తీ చేశారు. మూడు బెర్తులనూ తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికే కట్టబెట్టారు. ఈ మేరకు ముగ్గురు కొత్త మంత్రులు ఆదివారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్ దర్బార్ హాల్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నూతన మంత్రులతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో.. గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వాకిటి శ్రీహరి మంత్రులుగా ప్రమాణం చేశారు. మొదటిగా.. మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డం వివేక్ ఇంగ్లిషులో ప్రమాణ స్వీకారం చేశారు.

అనంతరం జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలుగులో ప్రమాణం చేశారు. ఒక్కొక్కరుగా పత్రాలపై సంతకం చేసి తొలుత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వద్దకు, అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలుపగా..
వారు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. పదవీ ప్రమాణ స్వీకారం చేసేందుకు మంత్రుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు చదివారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ జి.ప్రసాద్‌కుమార్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మజ్లిస్ శాసనసభాపక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీ కోదండరాం, డీజీపీ జితేందర్ తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నూతనంగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల కుటుంబసభ్యులు హాజరయ్యారు. కాగా, ముగ్గురు నూతన మంత్రుల ప్రమాణం కేవలం 9నిమిషాల్లోనే పూర్తయింది. మద్యాహ్నం 12.13 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం.. 12.23 గంటలకే ముగిసింది. అయితే మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించి రాజ్‌భవన్ ముద్రించిన ఆహ్వాన పత్రికల్లో కార్యక్రమం మధ్యాహ్నం 12.19 గంటలకు ఉంటుందని పేర్కొంది. కానీ, చెప్పిన దానికంటే 6 నిమిషాల ముందుగానే కార్యక్రమం మొదలైంది. కాగా, కొత్త మంత్రులకు సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు నూతన మంత్రులకు ‘ఎక్స్’ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. వారితోపాటు శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న జాటో తు రాంచందర్‌నాయక్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
స్థానిక ఎన్నికల తరువాత మరో ముగ్గురికి!
ఆదివారం చేపట్టిన మంత్రివర్గ విస్తరణతో రేవంత్ క్యాబినెట్‌లో మంత్రుల సంఖ్య 14కు చేరింది. మరో మూడు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అయితే రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల తరువాత మిగిలిన ఆ మూడు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి మంత్రివర్గ విస్తరణ సుదీర్ఘకాలంగా వాయిదా పడుతూ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి రేపు, మాపు అంటూ పలు దఫాలుగా విస్తరణను వాయిదా వేశారు. దీంతో మంత్రివర్గంలో చోటు కోసం ఆశావహుల పేర్లతో జాబితా రోజు రోజుకూ పెరిగిపోయింది. అదే స్థాయిలో పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి పెరిగింది. మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి పలు దఫాలు సమావేశమయ్యారు. చివరికి సుమారు 17 నెలల తర్వాత శనివారం రాత్రి పార్టీ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సామాజిక సమీకరణాల సమతూకం పాటిస్తూ మాల, మాదిగ, బీసీ వర్గాలకు చెందిన ముగ్గురితో మంత్రివర్గాన్ని సీఎం రేవంత్‌రెడ్డి విస్తరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట
For Telangana News And Telugu News