CM Revanth Reddy: రాష్ట్ర సాధనే శ్వాసగా పోరాడిన యోధుడు జయశంకర్
ABN , Publish Date - Aug 06 , 2025 | 03:45 AM
రాష్ట్ర సాధన కోసం పోరాడిన మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్, ప్రజాయుద్ధ నౌక గద్దర్ సేవలను సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు.
పాటతోనే ప్రజలను చైతన్యపరిచిన వ్యక్తి గద్దర్
నేడు జయశంకర్ జయంతి, గద్దర్ వర్ధంతి సందర్భంగా వారిని గుర్తుచేసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సాధన కోసం పోరాడిన మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్, ప్రజాయుద్ధ నౌక గద్దర్ సేవలను సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. మంగళవారం జయశంకర్ జయంతి, గద్దర్ వర్ధంతి సందర్భంగా వారిద్దరి కృషిని గుర్తుచేసుకున్నారు. జయశంకర్ తన జీవితాన్ని రాష్ట్ర సాధ న కోసం పూర్తిగా అంకితం చేశారన్నారు. ఆయన జీవితమంతా తెలంగాణ కోసం కలలు కంటూ, ఉద్యమానికి మార్గదర్శనం చేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను, స్ఫూర్తిని కొనసాగిస్తామని, అందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
అలాగే తెలంగాణ సాధన ఉద్యమానికి గద్దర్ ఆయువుపట్టుగా నిలిచారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పాటనే తన ఆయుధంగా మలుచుకుని ప్రజలను చైతన్య పరిచారని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఊపిరి పోసిన వారిలో గద్దర్ అగ్రగణ్యుడని, ఆయన నమ్మిన సిద్ధాంతాల కోసం చివరి వరకు పోరాడారని తెలిపారు. కాగా, రాష్ట్ర సాధన కోసం మలి దశ ఉద్యమ పోరాటంలో జయశంకర్ అందించిన స్ఫూర్తి మరువలేనిదని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు.