CM Revanth Reddy: మేడారం పనులు వంద రోజుల్లో పూర్తి కావాలి
ABN , Publish Date - Sep 09 , 2025 | 04:55 AM
మేడారంలో చేపట్టనున్న అభివృద్ధి పనులను వంద రోజుల్లో పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. జంపన్న వాగులో నీరు నిలిచేలా ప్రాంతాల వారీగా ఎక్కడికక్కడ చెక్ డ్యామ్‌ల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
జాతర వేళ భక్తులకు ఇబ్బందులు రాకూడదు
వారంలో నేనే స్వయంగా వచ్చి పరిశీలిస్తా: సీఎం
మేడారం, బాసర అభివృద్ధిపై అధికార్లతో సమీక్ష
ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్
పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం
హైదరాబాద్/ములుగు, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): మేడారంలో చేపట్టనున్న అభివృద్ధి పనులను వంద రోజుల్లో పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. జంపన్న వాగులో నీరు నిలిచేలా ప్రాంతాల వారీగా ఎక్కడికక్కడ చెక్ డ్యామ్‌ల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈ వారంలో తానే స్వయంగా వచ్చి క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తానని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. మేడారం, బాసర ఆలయాల అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మేడారం అభివృద్ధికి సంబందించిన డిజైన్లను పరిశీలించిన సీఎం.. పూర్తిగా సహజసిద్ధమైన రాతి కట్టడాలతో నిర్మాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ వసతులు ఉండాలని సూచించారు. మేడారం మహాజాతర నాటికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ విస్తరణ, అభివృద్ధికి సంబంధించి స్థానిక సెంటిమెంట్‌ను గౌరవించడంతోపాటు నిపుణులు, పూజారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. సమీక్షలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ పాల్గొన్నారు.
మాస్టర్‌ప్లాన్ వివరాలు సిద్ధం చేసుకోండి
అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చేవారం మేడారంలో పర్యటించనున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మేడారం సమ్మక్క-సారలమ్మల జాతర ఏర్పాట్లతో పాటు మాస్టర్‌ప్లాన్‌లో నిర్ణయించిన అభివృద్ధి పనులను సీఎం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని చెప్పారు. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ వివరాలు, అభివృద్ధి పనుల ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆలయ ఆధునికీకరిస్తామని అన్నారు. సెప్టెంబరు 15 నుంచి పనులు ప్రారంభించి, జనవరి మొదటి వారంలోగా పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. మేడారం మాస్టర్ ప్లాన్‌ను సీఎం రేవంత్ పరిశీలించారని, మూడు నెలల వ్యవధిలో పనులు పూర్తవ్వాలని ఆదేశించారని పేర్కొన్నారు. మేడారం జాతరకు అవసరమైన ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామని వివరించారు.