CM Revanth Reddy: దక్షిణాదిపై కేంద్రం కుట్రను తిప్పికొడతాం!
ABN , Publish Date - Mar 14 , 2025 | 05:30 AM
నియోజకవర్గాల పునర్విభజన పేరిట దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రను తిప్పికొడతామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆ మేరకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు.

సీట్లు రాలేదన్న అక్కసుతో దక్షిణాది ప్రాధాన్యాన్ని తగ్గించే యత్నం
రాష్ట్రాల హక్కుల పరిరక్షణకు అంతా ఏకం కావాలి: సీఎం
కేంద్రంపై పోరుకు 22న చెన్నైలో భేటీకి రావాలని స్టాలిన్ ఆహ్వానం
రేవంత్‌రెడ్డికి లేఖను అందించిన డీఎంకే బృందం
అధిష్ఠానం అనుమతితో చెన్నైకి వెళ్తానన్న ముఖ్యమంత్రి
న్యూఢిల్లీ, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల పునర్విభజన పేరిట దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రను తిప్పికొడతామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆ మేరకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది నియోజకవర్గాల పునర్విభజన కాదని, అది ముమ్మాటికీ దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యాన్ని తగ్గించే కుట్రని మండిపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు కలిగే నష్టం, చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించేందుకు 22న చెన్నైలో జరిగే సమావేశానికి రావాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆహ్వానించారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో రేవంత్‌రెడ్డిని తమిళనాడు మంత్రి కె.ఎన్.నెహ్రూ ఆధ్వర్యంలోని డీఎంకే ప్రతినిధి బృందం కలిసింది. సీఎం స్టాలిన్ రాసిన లేఖను ముఖ్యమంత్రికి అందించారు. అన్ని పార్టీలు, పౌర సంఘాల అభిప్రాయాలు సేకరించేందుకు స్టాలిన్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారని రేవంత్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో ఎలా వ్యవహరించాలనే అంశంపై స్టాలిన్ కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆయన్ను ప్రోత్సహిస్తామని చెప్పారు. ‘‘2026 తర్వాత చేపట్టే జన గణన వరకు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టకూడదన్న నిబంధన ఉంది. కానీ, కేంద్రం అవేమీ పట్టించుకోకుండా ఆ ప్రక్రియను తెరపైకి తెచ్చింది. నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడులో ఇప్పటికే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశాం. ఈ విషయంలో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఒడిసా, పంజాబ్ రాష్ట్రాలతో కూడిన ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ)లో చేరేందుకు అంగీకారం తెలుపుతారని ఆశిస్తున్నా. జేఏసీలోకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ప్రతినిధిని నియమించాలని కోరుతున్నా’’ అని స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు. డీఎంకే ప్రతినిధులతో సమావేశం తర్వాత రేవంత్ మీడియాతో మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రాల నుంచి బీజేపీకి పెద్దగా ప్రాతినిధ్యం లేదని, ఇక్కడి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అధిష్ఠానం అనుమతి తీసుకుని చెన్నై సమావేశానికి హాజరవుతానన్నారు.
భట్టి, జానారెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష భేటీ
నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణలోనూ చర్చలు జరిపేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు అన్ని పార్టీల నేతలను సమావేశానికి ఆహ్వానించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి, మాజీ మంత్రి జానారెడ్డికి సూచించినట్లు చెప్పారు. తాము నిర్వహించే సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కూడా ఆహ్వానిస్తామన్నారు. ఆయన హాజరై.. సమావేశంలో అభిప్రాయాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల హక్కుల పరిరక్షణకు పార్టీలకతీతంగా అందరూ ఏకతాటిపైకి రావాలని విజ్ఞప్తి చేశారు. కాగా, బూర్గుల రామకృష్ణారావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని రేవంత్‌రెడ్డి కొనియాడారు. బూర్గుల జయంతి సందర్భంగా గురువారం ఆయనకు సీఎం నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమరయోధునిగా, సీఎంగా, గవర్నర్‌గా, సాహితీవేత్తగా బూర్గుల బహుముఖ ప్రజ్ఞ కనబరిచారని అన్నారు.