Share News

CM Revanth Reddy Calls for Active DC Presidents: కొట్టాలన్నంత కోపం ఉండేది

ABN , Publish Date - Dec 03 , 2025 | 04:27 AM

సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎంను కాకముందు చాలా మందిపై.. గదిలో పడేసి కొట్టాలన్నంత కోపం ఉండేదని అన్నారు...

CM Revanth Reddy Calls for Active DC Presidents: కొట్టాలన్నంత కోపం ఉండేది

  • సీఎం కాకముందు చాలా మందిపై అలా అనిపించేది.. సీఎం అయ్యాక అది వృథా అనిపించింది

  • ఈ సమస్య రాహుల్‌గాంధీకీ తప్పలేదు

  • ఆ కుటుంబంపైనే జీ23 పేరుతో పేపర్లు

  • డీసీసీ చీఫ్‌లకు 6 నెలలు ప్రొబేషనరీ

  • నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎంను కాకముందు చాలా మందిపై.. గదిలో పడేసి కొట్టాలన్నంత కోపం ఉండేదని అన్నారు. సీఎం అయ్యాక అది వృధా అనిపించిందని, అన్నీ మరిచిపోయి రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తున్నానని తెలిపారు. రాజకీయాల్లో కాళ్లలో కట్టె పెట్టడమన్నది సహజమని, అది గేమ్‌ రూల్‌ అని పేర్కొన్నారు. దీనిని సమస్యగా చూడొద్దని, కట్టెను తీసేసుకుని ముందుకు పోవాలని కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షులకు సూచించారు. స్వయంగా రాహుల్‌గాంధీకే ఈ సమస్య ఉందని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబంపైనే జీ 23 పేరుతో సంతకాలు చేసి కాగితాలు పెడుతున్నారని తెలిపారు. మంగళవారంగాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ అధ్యక్షుతన జరిగిన టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం మాట్లాడారు. జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కావడమన్నది అంత సులవైన విషయం కాదని, ఇది పార్టీ ఇచ్చిన గొప్ప బాధ్యత అని అన్నారు. కొత్త అధ్యక్షులు సీనియర్‌ నాయకుల ఇళ్లకు వెళ్లి సహకరించాల్సందిగా కోరాలని, నామోషీగా భావించవద్దని సూచించారు. తనకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినప్పుడు ఎంత మంది సీనియర్‌ నేతల ఇళ్లకు వెళ్లి కలిశానో గుర్తు చేశారు. డీసీసీ అధ్యక్ష బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ‘‘మన హిందువుల్లోనే ఒక్కొక్కరికి ఒక్కో దేవుడిపై నమ్మకం ఉంటుంది. పెళ్లి చేసుకోనివారికి హనుమంతుడు ఉన్నాడు. రెండు పెళ్లిళ్లు చేసుకునే వారికి ఇంకో దేవుడున్నాడు. మందు తాగేవారికి మరో దేవుడున్నాడు. ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ.. కల్లు పొయ్యాలె, కోడి కొయ్యాలె అనే వాళ్లకు ఉన్నరు. పప్పన్నం తినేటోళ్లకు కూడా దేవుడున్నడు. దేవుళ్ల విషయంలోనే ఏకాభిప్రాయం లేనప్పుడు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష నియామకంలో ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను. కాంగ్రెస్‌ పార్టీ.. రకరకాల మనుషులు, మనస్తత్వాలను కలుపుకొనిపోయే పార్టీ’’ అని సీఎం రేవంత్‌ అన్నారు. కొత్త డీసీసీ అధ్యక్షులు అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు.


6 నెలల ప్రొబేషనరీ పీరియడ్‌..

రాజకీయాల్లో ప్రజలకు పనులు చేయడమే కాకుండా.. చేసింది చెప్పుకోవాల్సిన అవసరమూ ఉందని సీఎం అన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత డీసీసీ అధ్యక్షులదేనన్నారు. ఈ సందర్బంగా కొత్త డీసీసీ అధ్యక్షులకు ఆరు నెలల ప్రొబేషనరీ పిరియడ్‌ కింద తీసుకుందామంటూ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌కు రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. వారి పనితీరుపై ప్రతి నెలా రిపోర్టు తీసుకుందామని, వాటి ఆధారంగా ఆయా డీసీసీలకు అధ్యక్షులుగా ఎవరు కొనసాగాలి, ఎవరు కొనసాగకూడదన్నది ఏఐసీసీ, మీనాక్షీ నటరాజన్‌, మహేశ్‌గౌడ్‌ నిర్ణయిస్తే బాగుంటుందని సూచించారు. దీనిపై మీనాక్షీ నటరాజన్‌.. స్పందిస్తూ గుజరాత్‌లో ఈ పద్ధతిని ఏఐసీసీ ఇప్పటికే ప్రారంభించిందన్నారు. ఇక్కడి డీసీసీ అధ్యక్షులకు ఆరు నెలలు సమయం ఇద్దామని, ఇచ్చిన పని సరిగా చేయకుంటే వేరే బాధ్యతలు అప్పగిద్దామని అన్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లో రాహుల్‌గాంధీని ప్రధానిని చేసే బాధ్యత డీసీసీ అధ్యక్షులపై ఉందని సీఎం రేవంత్‌ అన్నారు. ప్రజా ప్రభుత్వం ఈ రెండేళ్లలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లే బాధ్యత డీసీసీ అధ్యక్షులు తీసుకోవాలని సీఎం రేవంత్‌ అన్నారు. ‘‘కేసీఆర్‌ మనకు రూ.8.11 లక్షల కోట్ల అప్పుతో ప్రభుత్వాన్ని అప్పగించారు. ఈ సంక్షోభాన్ని సరిదిద్దుకుంటూ రాష్ట్రాన్ని సంక్షేమం వైపునకు నడిపిస్తున్నాం. టోనీ బ్లెయిర్‌, సత్య నాదెళ్ల, ఆబీఐ మాజీ గవర్నర్‌ రఘురామరాజన్‌ వంటి మేధావులు.. తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌ డాక్యుమెంట్లో ఇన్‌పుట్స్‌ ఇచ్చారు. ఫ్యూచర్‌ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించే గ్లోబల్‌ సమ్మిట్‌లో విజన్‌ డాక్యుమెంట్‌ను ఆవిష్కరిస్తాం’’ అని సీఎం చెప్పారు.

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో కమీషన్లే..

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో.. ఉన్న ఎయిర్‌ పోర్టుల్లో కమీషన్లు తీసుకోవడమే తప్ప.. కొత్తగా ఎయిర్‌పోర్టులు కట్టాలన్న ఆలోచన కేసీఆర్‌ చేయలేదని సీఎం రేవంత్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో కేంద్రం నుంచి వరంగల్‌, భద్రాద్రి, రామగుండం, ఆదిలాబాద్‌ ఎయిర్‌ పోర్టుల నిర్మాణానికి అనుమతులు తెచ్చుకున్నామని గుర్తు చేశారు. వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు ఈ నెలాఖర్లో శిలాఫలకం వేసుకోబోతున్నట్లు చెప్పారు. మోదీ నుంచి చంద్రబాబు వరకు మాట్లాడి 12 లేన్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే, మచిలీపట్నం పోర్టు కనెక్టివిటీని ఏర్పాటు చేసుకోబోతున్నామని వివరించారు. కేంద్రంతో కొట్లాడి హైదరాబాద్‌-బెంగుళూరు గ్రీన్‌ఫీల్డ్‌ హైవేతోపాటు బుల్లెట్‌ ట్రైన్‌ మంజూరు చేయించుకున్నామని తెలిపారు. ప్రాథమికంగా ఒప్పుకున్నా.. ప్రధాని మోదీని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ఢిల్లీకి వెళుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అడగడం మన బాధ్యత అని, ఇవ్వకుంటే తెలంగాణలో బీజేపీని ప్రజలు నేలమట్టం చేస్తారని అన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 7న తాను ఉస్మానియా వర్సిటీకి వెళుతున్నానని, అవసరమైన నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారు. ఓయూను ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు ఎంతైనా ఖర్చు చేస్తామన్నారు.


కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఏ అక్కకు బతుకమ్మ చీర ఇచ్చినా.. కేసీఆర్‌పై శాపనార్థాలు పెట్టారని సీఎం రేవంత్‌ అన్నారు. ప్రస్తుతం ఇందిరమ్మ చీర అందిన అక్కలు సంతోషంగా పండుగ చేసుకుంటుంటే.. అందనివారు తమకెందుకు ఇవ్వలేదంటూ అడుగుతున్నారని తెలిపారు. మొత్తం కోటి మంది ఆడబిడ్డలకు చీర రూపంలో ప్రభుత్వం సారె పెడుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఆడబిడ్డకూ ఇందిరమ్మ చీర అందేలా చూసే బాధ్యత డీసీసీ అధ్యక్షులదేనన్నారు. ఇక నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించి సోనియా, రాహుల్‌గాంధీలపై మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదును ఖండిస్తూ పీసీసీ కార్యవర్గం తీర్మానాన్ని ఆమోదించింది. ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఓటు చోరీ అంశం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే సోనియా, రాహుల్‌లపై మనీ ల్యాండరింగ్‌ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఎక్కడిదాకైనా పోరాడతామనే సందేశాన్ని ప్రధాని మోదీకి ఇవ్వదలచుకున్నామని చెప్పారు. మీనాక్షీ నటరాజన్‌ మాట్లాడుతూ కొత్త డీసీసీ అధ్యక్షుల ఎంపిక నిష్పాక్షికంగా, శాస్త్రీయంగా జరిగిందన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి, పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ ఎవరి పేరునూ ప్రతిపాదించలేదని, కేవలం ప్యానల్‌ ద్వారా మాత్రమే ఎంపిక జరిగిందని స్పష్టం చేశారు. డీసీసీల పనితీరు ఆధారంగా ప్రభుత్వంలో సముచిత స్థానం లభిస్తుందన్నారు. పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ శకం ముగిసి పోయిందని, వాటాల పంచాయతీలో తేడాల వల్లనే ఆ కుటుంబంలో కొట్లాట జరుగుతోందని వ్యాఖ్యానించారు. పది రోజుల్లో కార్పొరేషన్లతోపాటుగా పెండింగ్‌ పదవులనూ భర్తీ చేయనున్నట్లు చెప్పారు. మెజారిటీ డీసీసీ అధ్యక్ష పదవులు బీసీలకే దక్కాయన్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, సీతక్క, టీపీసీసీ కార్యవర్గ సభ్యులు, జిల్లా, పట్టణకాంగ్రెస్‌ కమిటీల అధ్యక్షులు పాల్గొన్నారు.

గ్లోబల్‌ సమ్మిట్‌కు రండి.. ఖర్గేకు సీఎం రేవంత్‌ ఆహ్వానం

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంగళవారం ఆహ్వానించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి మంగళవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి న్యూఢిల్లీ వచ్చిన సీఎం రేవంత్‌ నేరుగా ఖర్గే నివాసానికి వెళ్లారు. గ్లోబల్‌ సమ్మిట్‌ విశేషాలను ఖర్గేకు వివరించిన సీఎం రేవంత్‌ డిసెంబరు 8, 9 తేదీల్లో ఫ్యూచర్‌ సిటీలో జరిగే కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. ఖర్గేతో భేటీ సందర్భంగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్ల అమలు తదితర అంశాలపై రేవంత్‌ చర్చించారని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి వెంట ఎంపీలు మల్లు రవి, సురేష్‌ షెట్కర్‌, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కడియం కావ్య, రఘువీర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఉన్నారు. ఇక, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీని సీఎం రేవంత్‌ బుధవారం పార్లమెంట్‌లో కలవనున్నారు. వారిద్దరితోపాటు అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను స్వయంగా కలిసి గ్లోబల్‌ సమ్మిట్‌కు ఆహ్వానిస్తారు.

Updated Date - Dec 03 , 2025 | 04:27 AM