Share News

Local Governance: రేపట్నుంచి సీఎం పట్టణ బాట

ABN , Publish Date - Nov 30 , 2025 | 06:25 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం (డిసెంబరు 1) నుంచి పట్టణ బాట పడుతున్నారు. ఏడో తేదీ వరకు ఏడు రోజుల పాటు కేవలం పట్టణ ప్రాంతాల్లో కొనసాగే...

Local Governance: రేపట్నుంచి సీఎం పట్టణ బాట
CM Revant Reddy

  • వారం రోజుల పాటు ప్రజల మధ్యనే..

  • రోజుకో జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన

  • పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

  • పంచాయతీ ఎన్నికల కోడ్‌తో ఇబ్బంది

  • లేకుండా పట్టణాల్లోనే కార్యక్రమాలు

హైదరాబాద్‌, నవంబరు 29 (ఆంధ్ర జ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం (డిసెంబరు 1) నుంచి పట్టణ బాట పడుతున్నారు. ఏడో తేదీ వరకు ఏడు రోజుల పాటు కేవలం పట్టణ ప్రాంతాల్లో కొనసాగే ఈ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. తొలిరోజు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌ మున్సిపాలిటీలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరిగే ఈ పర్యటనలో పొదుపు సంఘాల మహిళలతో సమావేశం అవుతారు. రెండో తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం మున్సిపాలిటీలో పర్యటిస్తున్నారు. అక్కడ మన్మోహన్‌సింగ్‌ ఎర్త్‌ సైన్స్‌ యూనివర్సిటీ భూమి పూజలో పాల్గొంటారు. అనంతరం విద్యార్థులు, పొదుపు మహిళలతో సమావేశం అవుతారు.

మూడో తేదీన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌లో పర్యటిస్తారు. అక్కడ రూ.44 కోట్లతో ఇంజనీరింగ్‌ కళాశాల నిర్మాణంతో పాటు రూ.491.17 కోట్లతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. నాలుగున ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో పర్యటిస్తారు. పట్టణ మౌలిక వసతుల కల్పనా నిధి నుంచి రూ.18.70 కోట్ల విలువజేసే అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. అయిదో తేదీన ఉమ్మడి వరంగల్‌ జిల్లా నర్సంపేట్‌ మున్సిపాలిటీలో పర్యటిస్తారు. రూ.200 కోట్లతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల భవనానికి భూమి పూజతోపాటు సుమారు రూ.637 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆరో తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లా దేవరకొండలో పర్యటిస్తారు. రూ.1,800 కోట్లతో చేపడుతున్న ఎద్దుల జలాశయం ప్రధాన కాలువ పనులతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. చివరగా సిద్దిపేటలో పర్యటిస్తారు. రూ.78 కోట్ల అంచనాలతో నిర్మించనున్న జిల్లా జైలు భవన నిర్మాణంతోపాటు రూ.300 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు.


కోడ్‌ పరిధిలోకి రాకుండా యాత్ర షెడ్యూల్‌

ఇప్పటికే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పరిధిలోకి రాకుండా ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. కొన్ని పట్టణాల అభివృద్ధి పనులు పంచాయతీల పరిధిలోకి కూడా వస్తుండటంతో ఎన్నికల కోడ్‌ పరిధిలోకి వస్తాయని అనుమానం ఉన్నవాటన్నింటినీ ముఖ్యమంత్రి శంకుస్థాపనల షెడ్యూల్‌ నుంచి తొలగించారు. కేవలం పట్టణప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనులకే భూమి పూజ చేసేలా పర్యటన ఖరారు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Deputy CM Batti: గ్రిడ్‌ రక్షణకు థర్మల్‌ విద్యుత్‌

అనాథగా నిజాం ప్యాలెస్.. పట్టించుకునే దిక్కే లేదా..?

Updated Date - Nov 30 , 2025 | 08:52 AM