Share News

Hyderabad: స్కూల్‌ బస్‌ కింద పడి బాలుడి మృతి

ABN , Publish Date - Jun 22 , 2025 | 04:50 AM

స్నేహితులతో కలిసి సైకిల్‌ తొక్కుతూ సరదాగా ఆడుకుంటున్న ఓ బాలుడిని ఊహించని రీతిలో మృత్యువు కబళించింది.

Hyderabad: స్కూల్‌ బస్‌ కింద పడి బాలుడి మృతి

  • హైదరాబాద్‌ ఆల్విన్‌ కాలనీలో ఘటన

జీడిమెట్ల, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): స్నేహితులతో కలిసి సైకిల్‌ తొక్కుతూ సరదాగా ఆడుకుంటున్న ఓ బాలుడిని ఊహించని రీతిలో మృత్యువు కబళించింది. ప్రమాదవశాత్తు జారి పడి.. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ స్కూల్‌ బస్సు చక్రాల కింద నలిగిపోయాడు. హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పోలీసుస్టేషన్‌ పరిధిలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనలో జైసిత్‌ చౌహాన్‌(10) అనే బాలుడు మరణించాడు. బిహార్‌కు చెందిన ముఖే్‌షచౌహన్‌, మధుకుమారి దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ వచ్చి నగరంలోని ఆల్విన్‌ కాలనీ ప్రాంతంలోని శివనగర్‌లో నివాసముంటున్నారు. వారికి కొడుకు జైసిత్‌ చౌహాన్‌, కుమార్తె ఉన్నారు.


జైసిత్‌ శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన తర్వాత స్నేహితులతో కలిసి ఇంటికి సమీపంలో సైకిల్‌ తొక్కుతూ ఆడుకుంటున్నాడు. శివనగర్‌, తులసీనగర్‌ ప్రాంతాలను కలిపే రహదారిని మరమ్మతుల కోసం ఇటీవల తవ్వగా.. ఆ గుంతల్లో దిగిన జైసిత్‌ సైకిల్‌ను అదుపు చేయలేకపోయాడు. ఈ క్రమంలో సైకిల్‌ పైనుంచి జారి.. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ స్కూల్‌ బస్సు ముందు చక్రం కింద పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. స్కూల్‌బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Jun 22 , 2025 | 04:50 AM