Electric Buses: దరాబాద్‌కు 2 వేల ఈవీ బస్సులు
ABN , Publish Date - May 23 , 2025 | 04:48 AM
దేశంలోని ఐదు నగరాలకు 10,900 ఎలక్ట్రిక్ బస్సులు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
పీఎం ఈ-డ్రైవ్ కింద ఇవ్వనున్న కేంద్రం
వచ్చే మార్చికి ఐదు నగరాలకు బస్సులు
కేంద్ర మంత్రి కుమారస్వామి వెల్లడి
న్యూఢిల్లీ, మే 22 (ఆంధ్రజ్యోతి): దేశంలోని ఐదు నగరాలకు 10,900 ఎలక్ట్రిక్ బస్సులు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నగరాల్లో ప్రజా రవాణాను మెరుగుపర్చడం, కాలుష్య రహిత విధానాలను అనుసరించడంలో భాగంగా చేపట్టిన ప్రధాన మంత్రి ఈ-డ్రైవ్ పథకం కింద వీటిని అందజేయనుంది. గురువారం ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖల మంత్రి హెచ్‌డీ కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ పథకం మొదటి దశలో భాగంగా.. బెంగళూరుకు 4,500, ఢిల్లీకి 2,800, హైదరాబాద్‌కు 2,000, అహ్మదాబాద్‌కు 1,000, సూరత్‌కు 600 ఎలక్ట్రిక్ బస్సులను అందించనున్నట్టు కుమారస్వామి వెల్లడించారు. దేశంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్రం ఎన్నో చర్యలు చేపడుతోందని, ఆ దిశగా ఇదొక కీలకమైన ముందడుగని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ ఐదు నగరాలకు బస్సులు అందిస్తామని తెలిపారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ నేతృత్వంలో, రాష్ట్రాల భాగస్వామ్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు.