Sammakka Sagar Project: 23న సమ్మక్కసాగర్‌పై సీడబ్ల్యూసీ భేటీ
ABN , Publish Date - Sep 04 , 2025 | 05:05 AM
సమ్మక్కసాగర్ (తుపాకులగూడెం) ప్రాజెక్టుకు అనుమతులివ్వాలంటూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాసిన లేఖతో కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) కదిలింది.
అనుమానాలను నివృత్తి చేయాలంటూ రాష్ట్రానికి లేఖ
హైదరాబాద్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): సమ్మక్కసాగర్ (తుపాకులగూడెం) ప్రాజెక్టుకు అనుమతులివ్వాలంటూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాసిన లేఖతో కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) కదిలింది. ఈనెల 23వ తేదీన హాజరై ఆ ప్రాజెక్టుపై అనుమానాలన్నీ నివృత్తి చేయడానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు లేఖ రాసింది. దీంతో ఈ ప్రాజెక్టుకు చెందిన చీఫ్ ఇంజనీర్‌తో పాటు అధికారులంతా ఢిల్లీకి వెళ్లడానికి సమాయత్తం అవుతున్నారు. రూ.9,257 కోట్లతో సమ్మక్కసాగర్ నిర్మాణం చేపట్టగా.. పనులు 95 శాతం మేర పూర్తయ్యాయి.
అయితే ప్రాజెక్టు ప్రయోజన వ్యయ నిష్పత్తి (బీసీఆర్)ని రూ.1.67 (రూపాయికి రూ.1.67 రాబడిగా) పేర్కొంటూ ఎస్సారెస్పీ రెండో దశ ఆయకట్టు స్థిరీకరణను సమ్మక్కసాగర్ ఖాతాలోనే చూపారు. కాళేశ్వరం కింద కూడా అదే ఆయకట్టును చూపడంతో.. అసలు సమస్య మొదలైంది. తాజాగా మారిన పరిణామాలతో ప్రధానంగా రెండు చర్యలు తీసుకుంటే తప్ప సమ్మక్కసాగర్‌కు అనుమతి రాదని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. ఒకటి ఛత్తీస్‌గఢ్ నుంచి ఎన్‌వోసీ.. రెండోది 2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును దీని కింద చూపించాల్సి ఉంటుంది. అయితే ఛత్తీస్‌గఢ్‌లో ముంపునకు గురయ్యే వంద ఎకరాలకు పరిహారం చెల్లించేందుకు వీలుగా నిర్ణయం తీసుకుంటే ఎన్‌వోసీకి మార్గం సుగమం కానుంది.