IAS Officer: ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు ఐఏఎస్ శివశంకర్
ABN , Publish Date - Aug 30 , 2025 | 02:41 AM
రాష్ట్ర వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శి, 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శివశంకర్ లోతేటిని కేంద్రప్రభుత్వం ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయించింది.
తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు
హైదరాబాద్, న్యూఢిల్లీ, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శి, 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శివశంకర్ లోతేటిని కేంద్రప్రభుత్వం ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయించింది. ఈ మేరకు ఆయనను ఎపీకి రిలీవ్ చేయాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) కార్యదర్శి ఏకే మిశ్రా శుక్రవారం తెలంగాణ ప్రభుత్వానికి ఉత్తర్వులు పంపించారు. హైకోర్టు ఆదేశాల మేరకు శివశంకర్‌ను ఏపీకి కేటాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. విజయనగరం జిల్లాలోని ధర్మవరం శివశంకర్ సొంతూరు. కానీ రంగారెడ్డి జిల్లాలోని తన మామగారి నివాసంలో ఉండి ఆయన సివిల్ సర్వీసెసు సాధించారు. యూపీఎస్సీకి చేసిన దరఖాస్తులో తన శాశ్వత చిరునామాగా రంగారెడ్డి జిల్లానే పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో క్యాడర్‌ను నిర్ణయించేటప్పుడు చిరునామా ఆధారంగా కేంద్రప్రభుత్వం ఆయనను తెలంగాణకు కేటాయించింది.
కానీ ఆయన ఏపీలోనే పనిచేస్తుండేవారు. 2024 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తూ... ఏ రాష్ట్ర కేడర్ ఆ రాష్ట్రానికి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఫలితంగా శివశంకర్ తెలంగాణ ప్రభుత్వానికి రిపోర్టు చేసి, ఇక్కడే కొనసాగుతున్నారు. అయితే తాను ఏపీ వాస్తవ్యుడనని, రంగారెడ్డి జిల్లా ఇంటి అడ్రస్ ఆధారంగా తనను తెలంగాణకు కేటాయించారని శివశంకర్ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. క్యాట్ ఆయనకు అనుకూలంగా తీర్పునిస్తూ ఏపీకి కేటాయించింది. వెంటనే ఆయనను రిలీవ్ చేయాలంటూ డీఓపీటీని ఆదేశించింది. క్యాట్ ఆదేశాలను సవాలు చేస్తూ డీఓపీటీ హైకోర్టులో పిటిషన్ వేయగా... క్యాట్ ఆదేశాలనే హైకోర్టు సమర్థించింది. ఈ నేపథ్యంలో శివశంకర్‌ను ఎపీకి రిలీవ్ చేస్తూ డీఓపీటీ తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇచ్చింది.