Share News

CBI: సబిత, కృపానందంను నిర్దోషులుగా ప్రకటించడం చెల్లదు

ABN , Publish Date - Aug 14 , 2025 | 03:42 AM

ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసులో అప్పటి పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి బీ కృపానందం, అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషులుగా ప్రకటించడం చెల్లదని సీబీఐ పేర్కొంది.

CBI: సబిత, కృపానందంను నిర్దోషులుగా ప్రకటించడం చెల్లదు

  • ఓఎంసీ కేసులో సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టులో కేంద్ర దర్యాప్తు సంస్థ అప్పీల్‌ దాఖలు

హైదరాబాద్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసులో అప్పటి పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి బీ కృపానందం, అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషులుగా ప్రకటించడం చెల్లదని సీబీఐ పేర్కొంది. ఓఎంసీ కేసులో ఏ-8 కృపానందం, ఏ-9 సబితపై కేసు రుజువు కాకపోవడంతో వారిని నిర్దోషలుగా ప్రకటిస్తూ నాంపల్లి సీబీఐ కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న బీవీ శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి గాలి జనార్ధన్‌ రెడ్డి, అప్పటి గనుల శాఖ డైరెక్టర్‌ వీడీ రాజగోపాల్‌, ఓఎంసీ కంపెనీ, గాలి జనార్ధన్‌రెడ్డి సన్నిహితుడు మెఫుజ్‌ అలీఖాన్‌ను మాత్రం సీబీఐ కోర్టు దోషులుగా ప్రకటించింది. ఆ తర్వాత వారు హైకోర్టుకు వెళ్లి బెయిల్‌ పొంది జైలు నుంచి విడుదలయ్యారు. మరో నిందితురాలు (ఏ-6), ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి దాఖలు చేసిన క్రిమినల్‌ రివిజన్‌ (డిశ్చార్జి పిటిషన్‌)ను ఇటీవలే హైకోర్టు కొట్టేసింది. ఆమె విచారణను ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేసింది. కాగా, ఈ కేసులో కృపానందం, సబితను నిర్దోషులుగా ప్రకటిస్తూ మే 6న సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయాలని హైకోర్టులో సీబీఐ అప్పీల్‌ దాఖలు చేసింది.


వారిద్దరి విషయంలో సీబీఐ కోర్టు పొరపాటు చేసిందని, కేవలం ఊహలు, అంచనాల ఆధారంగా వారికి కేసు నుంచి విముక్తి కల్పించిందని సీబీఐ ఆరోపించింది. కృపానందం, సబితలకు వ్యతిరేకంగా స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోవడంలో సీబీఐ కోర్టు విఫలమైందని పేర్కొంది. గాలి జనార్దన్‌ రెడ్డి ఆధ్వర్యంలోని ఓఎంసీకి అక్రమంగా గనుల లీజు కేటాయించడంలో వారి పాత్ర సైతం ఉందని స్పష్టం చేసింది. కాగా ప్రజాప్రతినిధుల క్రిమినల్‌ కేసులు విచారించే రోస్టర్‌ ఉన్న జస్టిస్‌ కే లక్ష్మణ్‌ సెలవులో ఉండటంతో ఈ అప్పీల్‌ పిటిషన్‌ బుధవారం జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌ రెడ్డి ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఓఎంసీ కేసుకు సంబంధించి గతంలో తాను న్యాయవాదిగా కొంతమందికి ప్రాతినిధ్యం వహించానని పేర్కొన్న జస్టిస్‌ విజయ్‌సేన్‌ రెడ్డి.. విచారణను ఈ నెల 18కి వాయిదా వేశారు.

Updated Date - Aug 14 , 2025 | 03:42 AM