Share News

Panchayat Election Fever in Telangana: రూకగ్రీవాలు

ABN , Publish Date - Nov 28 , 2025 | 05:05 AM

అటు గ్రామ పెద్దలు కూడా.. ఎన్నికల్లో అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసే బదులు.. ఆ డబ్బునే ఏకగ్రీవం కోసం వెచ్చిస్తే ఊర్లో అభివృద్ధి పనులకు వినియోగించవచ్చని ప్రతిపాదిస్తూ జోరుగా చర్చలు జరుపుతున్నారు. ఫలితంగా ఏకగ్రీవాల కోసం నువ్వానేనా అన్నట్టుగా వేలంపాటలు సాగుతున్నాయి....

Panchayat Election Fever in Telangana: రూకగ్రీవాలు

గ్రామ పెద్దలు.. ఈ మాట కన్నా గ్రామ పెద్ద అనే మాటే కిక్కు! సర్పంచ్‌ పదవి చేపడితేనే దానికి సార్థకత! ఆ హోదానే వేరు.. ఆ గుర్తింపే ప్రత్యేకం!! ఇలా పదవీకాంక్షతో ఆశావహులు ఏకగ్రీవ అస్త్రాన్ని వదులుతున్నారు. పోటీ లేకుండా సర్పంచ్‌గా ఎన్నికయ్యేందుకు పావులు కదుపుతున్నారు. ఇందుకు ఎంతడబ్బైనా వెచ్చించేందుకు సిద్ధం అంటున్నారు.

  • సర్పంచ్‌ పదవికి జోరుగా వేలం పాటలు

  • ఏకగ్రీవం చేసి ఆ డబ్బును అభివృద్ధికి వెచ్చించే యోచన

  • ఎంతైనా వెచ్చించేందుకు సిద్ధమవుతున్న ఆశావహులు

  • గద్వాల జిల్లా కొండపల్లిలో రూ.60 లక్షలు పలికిన పదవి

  • గొర్లఖాన్‌ దొడ్డిలో 53 లక్షలు.. చింతలకుంటలో 38.5 లక్షలు

  • స్మశానానికి ఎకరం ఇచ్చే వారికే పదవి.. వామనపల్లిలో ఆఫర్‌

..అటు గ్రామ పెద్దలు కూడా.. ఎన్నికల్లో అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసే బదులు.. ఆ డబ్బునే ఏకగ్రీవం కోసం వెచ్చిస్తే ఊర్లో అభివృద్ధి పనులకు వినియోగించవచ్చని ప్రతిపాదిస్తూ జోరుగా చర్చలు జరుపుతున్నారు. ఫలితంగా ఏకగ్రీవాల కోసం నువ్వానేనా అన్నట్టుగా వేలంపాటలు సాగుతున్నాయి. గద్వాల జిల్లా రూరల్‌ మండలం కొండపల్లి గ్రామంలో ఎవరైనా ఆలయ అభివృద్ధికి డబ్బులిస్తే వారే ఏకగ్రీవంగా సర్పంచ్‌ కావొచ్చునని ప్రకటించడంతో ఓ సీడ్‌ ఆర్గనైజర్‌ సై అన్నారు. ఆలయ అభివృద్ధికి రూ. 60 లక్షలు ఇస్తానని ఆయన ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే తాను తప్ప మరెవ్వరూ నామినేషన్‌ వేయకపోతేనే తాను ఆ డబ్బిస్తానని ఆయన షరతు పెట్టారు. ఇక కేటీదొడ్డి మండలం చింతలకుంట గ్రామంలో ఓ నాయకుడు రూ.38.5 లక్షలు చెల్లిస్తానని చెప్పడంతో ఊర్లో వారంతా కొత్త సర్పంచ్‌గా ఆయనకే ముక్తకంఠంతో మద్దతు పలికినట్లు తెలుస్తోంది. గట్టు మండలం గొర్లఖాన్‌ దొడ్డిలో సర్పంచ్‌ పదవి రూ. 53 లక్షలు పలికింది. ఆయితే ఈ వేలం పాట పాడిన వ్యక్తికి కుటుంబసభ్యుల నుంచి అభ్యంతరం రావడంతో ప్రస్తుతం వారిని గ్రామపెద్దలు ఒప్పించే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఇదే మండలంలోని అంతపల్లి గ్రామంలో ఓ నాయకుడు రూ. 23 లక్షలకు వేలం పాట పాడారు. అయితే మాజీ సర్పంచ్‌ తన పాత బిల్లులు ఇస్తేనే ఇందుకు ఒప్పుకొంటానని చెప్పారని, దీనికి వేలం పాట పాడిన వ్యక్తి అంగీకరించకపోవడంతో ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. వీటితో పాటు ధరూర్‌ మండలం చిన్నపాడు, వామనపల్లి గ్రామాల్లో ఎవరైతే స్మశానానికి ఎకరం భూమి విరాళంగా ఇస్తారో వారే సర్పంచ్‌ అవుతారని చర్చలు చేస్తున్నారు. జాంపల్లి గ్రామంలో కూడా వేలంపాట వేసినట్లు తెలుస్తోంది. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా శనివారం సాయంత్రం వరకు మరికొన్ని గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. వికారాబాద్‌ జిల్లా యాలాల పరిధిలో కొత్తగా ఏర్పడిన పేర్కంపల్లితండా పంచాయతీ ఏకగ్రీవమైంది. గ్రామాభివృద్ధి కోసం రూ.3 లక్షలు ఇస్తానని తండాకు చెందిన ఈర్యానాయక్‌ ముందుకు రావడంతో ఆయన్నే సర్పంచ్‌గా ఎన్నుకొనేందుకు గ్రామస్థులు ఓకే చెప్పారు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలంలోని బీజీ వెంకటాపూర్‌ సర్పంచ్‌ పదవి కోసం ఐదుగురి మధ్య పోటాపోటీగా వేలం పాట సాగింది. ఒకరు రూ.13.6 లక్షలకు పాడగా.. అంత ఇచ్చుకోలేమంటూ మిగతా ఇద్దరు నామినేషన్లు వేసేందుకు మండల కార్యాలయానికి వెళ్లారు.


ఇదే మండలంలోని మాందాపూర్‌లో సర్పంచ్‌ పదవి రూ.10.75 లక్షలకు ఏకగ్రీవం అయినట్లు తెలిసింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు తొలిరోజు గురువారం ఉత్సాహంగా నామినేషన్లు వేశారు. ఖమ్మం జిల్లాలో 7 మండలాల్లోని 192 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులకు 99, వార్డు మెంబర్ల కోసం 49నామినేషన్లు దాఖలయ్యాయి. కొత్తగూడెం జిల్లా సర్పంచ్‌ పదవులకు 82, వార్డుల మెంబర్ల కోసం 87 నామినేషన్లు దాఖలయ్యాయి.

ఇంటింటికీ ఉచిత మినరల్‌ వాటర్‌

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మూటాపురంలో రావెళ్ల కృష్ణారావు అనే అభ్యర్థి గ్రామ ప్రజలను హామీల వెల్లువలో ముంచెత్తారు. తనను సర్పంచ్‌గా గెలిపించినా, ఏకగ్రీవం చేసినా ఊరి కోసం ఫలనా ఫలనా పనులు చేస్తానంటూ ఏకంగా కోటి రూపాయలతో మేనిఫెస్టో విడుదల చేశారు. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ మేనిఫెస్టోలోని వివరాల ప్రకారం.. గ్రామంలోని వీరన్నస్వామి ఆలయం కోసం ఎకరం భూమి విరాళంగా ఇస్తానని కృష్ణారావు ప్రకటించారు. తాను పదవిలో కొనసాగిన ఐదేళ్లపాటు ఊర్లోని అందరి ఇంటి బిల్లులు, నల్లా బిల్లులు తానే కడతానని పేర్కొన్నారు. సొంత ఖర్చుతో ఊర్లో గ్రంథాలయం భవనాన్ని కట్టిస్తానని.. ప్రతినెలా ఉచిత వైద్య శిబిరాలు పెట్టించి.. ఉచితంగా మందులను పంపిణీ చేయిస్తానని చెప్పారు. మినరల్‌ వాటర్‌ ప్లాంటును ఏర్పాటు చేసి ప్రతి ఇంటికీ ఉచితంగా మినరల్‌ వాటర్‌ను పంపిణీ చేయిస్తానని హామీ ఇచ్చారు. పెళ్లిళ్లు, జాతరలకు డీజేలు ఏర్పాటు చేయిస్తానని.. పేద కుటుంబాల్లోని ఆడ పిల్లల పెళ్లిళ్లకు చీర, సారె కానుకగా అందజేస్తానని, వికలాంగులకు ఉచితంగా ట్రైసైకిళ్లు ఇస్తానని, ఊర్లోని దేవాలయాలకు, చర్చి, మసీదుకు యేటా రూ.50వేల చొప్పున ఇస్తానని, వినాయక చవితికి అన్ని ఉత్సవ కమిటీలకు విగ్రహాలను ఉచితంగా ఇస్తానని మాటిచ్చారు. ఆగస్టు 15, జనవరి 26న స్కూళ్లలో నిర్వహించే జెండా వందనం కార్యక్రమాల్లో పిల్లలకు బహుమతులు ఇస్తానని, ప్రతి తరగతిలో బాగా చదివే ఇద్దరిని ఎంపిక చేసి ఏటా రూ.2వేల చొప్పున స్కాలర్‌షి్‌ప అందజేస్తానని చెప్పారు. బయటి పాఠశాలల్లో చదివే గ్రామానికి చెందిన విదార్థుల్లో ఏటా పది మంది చొప్పున ఎంపిక చేసి సైకిళ్లను ఇస్తానని, సంక్రాంతి పండుగకు ముగ్గుల పోటీలు నిర్వహంచి.. బహుమతుల కింద రూ.5వేలిస్తానని అయ్యప్ప మాలధారులకు నిత్యాన్నదానం చేస్తానని,ప్రతి దసరాకు 100మంది పేదలకు దుస్తులు, 10మంది మహిళలకు కుట్టు మిషన్లు అందజేస్తానని ప్రకటించారు. చావులకు డెడ్‌బాడీ ఫ్రీజర్‌ను ఉచితంగా అందజేయడంతో పాటు వైకుంఠరథం ఏర్పాటు చేస్తానని చెప్పారు.


సెల్‌ఫోన్ల లైటే వెలుతురుగా

సంగారెడ్డి జిల్లా కందిలో రైతువేదికలో ఏర్పాటు చేసిన కేంద్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లను స్వీకరించారు అక్కడ విద్యుత్తు సౌకర్యం సరిగా లేక చీకట్లు కమ్ముకున్నాయి. నామినేషన్లు సమర్పించే ప్రదేశంలో బల్బులను ఏర్పాటు చేయలేదు. వెలుతురు లేకపోవడంతో అభ్యర్థిని ప్రతిపాదించేందుకు వచ్చినవారే తమ సెల్‌ఫోన్‌ లైట్లను ఆన్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ వెలుగులోనే నామినేషన్‌ పత్రాలపై అభ్యర్థులు సంతకాలు పెట్టారు. ఈ కౌంటర్‌లో చాలామంది నామినేషన్లను దాఖలు చేయడానికి రాగా టోకెన్లు ఇచ్చి లోనికి పిలిచారు. సాయం త్రం 6గంటలకల్లా చీకటి పడడంతో సెల్‌ఫోన్లను వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Updated Date - Nov 28 , 2025 | 07:27 AM