Cabinet Meeting: ఎస్సీ వర్గీకరణ.. బీసీ రిజర్వేషన్ల పెంపు!
ABN , Publish Date - Mar 06 , 2025 | 04:35 AM
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన రెండు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టంగా చేయాలని భావిస్తోంది.

నేడు క్యాబినెట్ భేటీలో చర్చ
అసెంబ్లీలో బిల్లులు.. ఢిల్లీకి అఖిలపక్షం
42 శాతం కోటా కోసం
రాజ్యాంగ సవరణ అవకాశాలపై చర్చ
రేషన్‌కార్డులు, ఫ్యూచర్ సిటీ అథారిటీ,
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై కూడా..
కొత్త మద్యం బ్రాండ్ల ధరల పెంపుపైనా!
యాదగిరిగుట్టకు ప్రత్యేక పాలక మండలి
ఏర్పాటు అంశంపైనా నిర్ణయం
హైదరాబాద్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై గురువారం మధ్యాహ్నం సచివాలయంలో జరగనున్న క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉద్యోగాల్లో 42ు రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన రెండు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టంగా చేయాలని భావిస్తోంది. అదే విధంగా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ రెండు అంశాలపైనా చర్చించి, వాటిని ఆమోదించనున్నారు. అదే విధంగా బీసీ రిజర్వేషన్ల అమలు కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లడం, 42ు రిజర్వేషన్ అమలు అంశాన్ని రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చేందుకు ఉన్న అవకాశాలు, కేంద్రంతో చర్చలు మొదలైన వాటిని క్యాబినెట్ భేటీలో చర్చకు తీసుకోనున్నట్లు తెలిసింది. వీటితో పాటు కొత్త రేషన్‌కార్డులు, హెచ్‌ఎండీఏ తరహాలో ఫ్యూచర్ సిటీ డెవల్‌పమెంట్ అథారిటీ ఏర్పాటు, భూభారతి విధివిధానాలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ తదితర అంశాలపైనా చర్చించనున్నారు.
రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్ల విక్రయానికి ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశీ, విదేశీ కంపెనీల నుంచి వచ్చే కొత్త బ్రాండ్లు, ఇప్పటికే ఉన్న బ్రాండ్ల ధరల పెంపు అంశంపైనా క్యాబినెట్‌లో చర్చించే అవకాశాలున్నట్టు సమాచారం. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రధానమంత్రి మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. ఆ విషయాలను కూడా మంత్రివర్గ సమావేశంలో మంత్రులతో సీఎం మాట్లాడే అవకాశం ఉంది. ఇసుక సరఫరాకు సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్.. అఽధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇసుక సరఫరా, ఇసుక ధరలపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. కృష్ణా, గోదావరి జలాల పంపిణీ, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం తదితర 35 అంశాలపై క్యాబినెట్ చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
యాదగిరిగుట్టకు పాలక మండలి
యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి.. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో ప్రత్యేక పాలక మండలి ఏర్పాటు కానున్నట్లు సమాచారం. బోర్డులో చైర్మన్, 13 మంది సభ్యులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై క్యాబినెట్‌లో చర్చించి, ఆమోదించనున్నట్టు తెలిసింది.
ఇవి కూడా చదవండి
Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్ అవినీతిపై పర్వేష్ వర్మ
Congress: కేరళ కాంగ్రెస్ నేతల భేటీకి థరూర్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.