Cabinet Reshuffle: స్థానిక పోరు తర్వాత పునర్వ్యవస్థీకరణ
ABN , Publish Date - Jun 09 , 2025 | 03:36 AM
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఏకంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణను చేపట్టనుందా ?అంటే కాంగ్రెస్ పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. అంతేకాదు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా పునర్వ్యవస్థీకరణ చేపట్టే అవకాశముందనే చర్చ కూడా ఆ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతుంది.
జూలైలోనే స్థానిక ఎన్నికలు!
ఆగస్టు 15 కల్లా పూర్తి
ఎన్నికల్లో పనితీరును బట్టి
పునర్వ్యవస్థీకరణలో అవకాశం
హైదరాబాద్, జూన్ 8(ఆంధ్రజ్యోతి): మంత్రి వర్గ విస్తరణలో ముగ్గురికే అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఏకంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణను చేపట్టనుందా ?అంటే కాంగ్రెస్ పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. అంతేకాదు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా పునర్వ్యవస్థీకరణ చేపట్టే అవకాశముందనే చర్చ కూడా ఆ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలను జూలై, ఆగస్టు నెలల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా జూలై మొదటి వారంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల తర్వాత పరిషత్ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలనూ నిర్వహించనున్నట్లు సమాచారం. మొత్తమ్మీద ఆగస్టు 15 కల్లా స్థానిక ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని చూస్తున్నట్టు తెలిసింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు బిల్లులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకున్నా పార్టీ పరంగా ఇస్తామని ప్రకటించి ఎన్నికలకు వెళ్లే ఆస్కారం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరును ఆధారంగా చేసుకుని మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టే అవకాశముందని విశ్వసనీయ సమాచారం.
నిజానికి, ఇటీవల కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులతో నిర్వహించిన సమావేశంలో స్థానిక ఎన్నికలపైన సీఎం రేవంత్‌రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. మంత్రుల పనితీరుపై పార్టీ అధిష్ఠానం రూపొందించిన ప్రగతి నివేదికను సీఎం ఈ సందర్భంగా మంత్రుల ముందు పెట్టినట్లు సమాచారం. ఇప్పటివరకూ ఆయా శాఖల్లో మంత్రుల పనితీరు, పార్టీకి నష్టం చేకూర్చే చర్యల ఆధారంగా అధిష్ఠానం మంత్రులకు ఏ, బీ, సీ గ్రేడ్లు ఇచ్చినట్లు తెలిసింది. ఆయా వివరాలను మంత్రుల ముందు పెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి.. పనితీరును మెరుగు పరుచుకోవాలని పలువురికి సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో ఆయా మంత్రుల పనితీరుపై అధిస్ఠానం దృష్టిసారిస్తుందని స్పష్టం కూడా చేసినట్టు తెలిసింది. శాఖల పరంగా ఇద్దరి నుంచి ముగ్గురు మంత్రుల పనితీరు అస్సలు బాగా లేదన్న అభిప్రాయంతో ఉన్న అధిష్ఠానం.. వారికి సీ గ్రేడు కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే, స్థానిక ఎన్నికల్లో సరైన పనితీరు చూపించని, శాఖల నిర్వహణలో మెరుగైన ఫలితాలు సాధించని మంత్రులను ఆయా శాఖల నుంచి తప్పించి వారికి వేరే శాఖలు కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. మంత్రివర్గం, శాఖల పునర్వ్యవస్థీకరణ చేపట్టే క్రమంలోనే పెండింగ్‌లో ఉన్న మూడు పదవులనూ కూడా భర్తీ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట
For Telangana News And Telugu News