Rent Dispute: అబ్దుల్లాపూర్‌మెట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు తాళం
ABN , Publish Date - Jul 08 , 2025 | 05:49 AM
దాదాపు మూడేళ్లుగా అద్దె చెల్లించకపోవడంతో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి భవన యజమాని తాళం వేశారు.
40 నెలలుగా భవనానికి అద్దె చెల్లించకపోవడం వల్లే
సబ్‌రిజిస్ట్రార్ హామీతో తాళం తొలగించిన యజమాని
అబ్దుల్లాపూర్‌మెట్; జూలై 7 (ఆంధ్రజ్యోతి): దాదాపు మూడేళ్లుగా అద్దె చెల్లించకపోవడంతో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి భవన యజమాని తాళం వేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలో పిట్లల రాజుకు చెందిన భవనంలో గత కొన్నేళ్లుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కొనసాగుతోంది. కాగా, సుమారు 40 నెలలుగా భవనానికి ఆ శాఖ అధికారులు అద్దె చెల్లించడం లేదు. దీంతో పలుమార్లు రాజు రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులను కలిసి అద్దె చెల్లించాలని విన్నవించుకున్నారు. గత నెల 4వ తేదీన మరోసారి జిల్లా రిజిస్ట్రార్‌ను కలిసి 15రోజుల్లో అద్దెను పూర్తిగా చెల్లించాలని.. లేని పక్షంలో 3-4 నెలల్లో కార్యాలయం ఖాళీ చేయాలని కోరారు. దీనికి స్పందించిన ఆ శాఖ జిల్లా అధికారులు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం బడ్జెట్‌ను కేటాయించిన వెంటనే పూర్తిగా అద్దె చెల్లిస్తామని రాజుకు లేఖ ద్వారా హామీ ఇచ్చారు.
దీంతో అద్దె చెల్లింపు మరింత ఆలస్యం అయ్యేలా ఉందని భావించిన రాజు.. సోమవారం కార్యాలయాన్ని సిబ్బంది తెరిచిన కొద్ది సేపటికి అక్కడికి చేరుకొని సిబ్బందిని బయటకు పంపి తాళం వేశారు. ఈ విషయాన్ని కార్యాలయ సిబ్బంది సబ్ రిజిస్ట్రార్ సునీతారాణికి తెలపగా, ఆమె వెంటనే అక్కడికి చేరుకొని ఉన్నత అధికారులతో మాట్లాడి 15 రోజుల్లో అద్దె చెల్లించేలా చర్యలు తీసుకుంటామని రాజుకు హామీ ఇచ్చారు. దాంతో ఆయన తాళాలను తొలగించారు. నిర్మాణ సమయంలో భవనంపై లోన్ తీసుకున్నానని, అధికారులు 40 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో ప్రతి నెలా ఈఎంఐ కట్టేందుకు ఇబ్బంది పడాల్సి వస్తోందని భవన యజమాని రాజు తన ఆవేదనను వ్యక్తం చేశారు.