Share News

KTR: జనతా గ్యారేజ్‌లా తెలంగాణ భవన్‌

ABN , Publish Date - Apr 24 , 2025 | 06:02 AM

బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజల అండగా నిలిచే పార్టీగా బీఆర్‌ఎస్‌ గుర్తింపు పొందుతోంది

KTR: జనతా గ్యారేజ్‌లా తెలంగాణ భవన్‌

  • ప్రజలకు ఏ సమస్య వచ్చినా బీఆర్‌ఎస్‌ అండగా నిలుస్తోంది

  • వరంగల్‌ గడ్డపై చరిత్ర సృష్టించేలా బీఆర్‌ఎస్‌ సభ: కేటీఆర్‌

వరంగల్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ భవన్‌ జనతా గ్యారేజ్‌లా మారిందని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా బీఆర్‌ఎ్‌సనే ఆశ్రయిస్తున్నారని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైడ్రా, లగచర్ల, హెచ్‌యూసీ వంటి అనేక సమస్యలపై బీఆర్‌ఎస్‌ ముందుండి పోరాడిందని ఆయన తెలిపారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద నిర్వహించబోయే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించి మీడియాతో మాట్లాడారు. 24 ఏళ్లుగా ప్రజలు తమకు ఏ బాధ్యత అప్పగించినా దానిని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నామని ఆయన అన్నారు. తెలంగాణ కోసం 14 ఏళ్లు ఉద్యమ పార్టీగా, పదేళ్లు అధికార పార్టీగా బీఆర్‌ఎస్‌ పనిచేసిందని, ప్రస్తుతం 16 నెలలుగా ప్రతిపక్ష పార్టీగా పని చేస్తోందని చెప్పారు.


ఈ నెల 27న వరంగల్‌ గడ్డపై రజతోత్సవ సభ చరిత్ర సృష్టిస్తుందని కేటీఆర్‌ తెలిపారు. అందుకోసం భారీగా జనసమీకరణ చేస్తున్నామని తెలిపారు. 1,250 ఎకరాల్లో సభను ఏర్పాటు చేస్తున్నామని, 40వేల వాహనాలు వచ్చినా పార్కింగ్‌కు ఇబ్బంది ఉండదన్నారు. వందకు పైగా వైద్య బృందాలు, 15 అంబులెన్సులు, వందల సంఖ్యలో తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే కొందరు కార్యకర్తలు, రైతులు సూర్యాపేట, వర్ధన్నపేట నుంచి ఎడ్లబండ్లపై జాతరకు వచ్చినట్లుగా తరలి వస్తున్నారని తెలిపారు. సభకోసం రెండువేల మందిని పార్టీ వలంటీర్లుగా నియమించామని చెప్పారు.

Updated Date - Apr 24 , 2025 | 06:02 AM