Share News

BRS: బనకచర్లపై సుప్రీంకు బీఆర్‌ఎస్‌!

ABN , Publish Date - Jul 30 , 2025 | 04:31 AM

గోదావరిపై ఏపీ సర్కారు నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది.

BRS: బనకచర్లపై సుప్రీంకు బీఆర్‌ఎస్‌!

  • కేసీఆర్‌తో కేటీఆర్‌, హరీశ్‌రావు భేటీ

  • ఫామ్‌హౌజ్‌లో ఉదయం నుంచి రాత్రి దాకా సుదీర్ఘ మంతనాలు

  • స్థానిక ఎన్నికలు, సీఎం రమేశ్‌ వ్యాఖ్యలు,

  • జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక అంశాలపై చర్చ

  • మోదీ, బాబు ప్రయోజనాలకే సీఎం తహతహ

  • బనకచర్లను అడ్డుకోవాల్సిందే: కేసీఆర్‌

సంగారెడ్డి, హైదరాబాద్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): గోదావరిపై ఏపీ సర్కారు నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. మంగళవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో మాజీ సీఎం కేసీఆర్‌తో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి భేటీ అయ్యారు. ఉదయం 9గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా అనేక అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటికే బనకచర్లపై ప్రజలకు అనేక రకాలుగా అవగాహన కల్పించామని, ఇక ప్రాజెక్టును అడ్డుకోవాలంటే సుప్రీంకోర్టుకు వెళ్లడమే మార్గమని వారు ఈ భేటీలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కాగా.. ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు, అక్కడ ప్రధాని మోదీ ప్రయోజనాలను కాపాడేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తహతహలాడుతున్నారని, ఈ విషయాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందని కేసీఆర్‌ ఈ భేటీలో వ్యాఖ్యానించినట్టు తెలిసింది. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి ఆంధ్రా ప్రయోజనాలను కాపాడే విధానాలను రాష్ట్ర ప్రభుత్వమే అమలుచేయం దుర్మార్గమని.. తెలంగాణ సాగునీటి రంగాన్ని ఆగం చేసే బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్తి తుల్లో నిలువరించాల్సిందేనని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై కేటీఆర్‌, హరీశ్‌, జగదీశ్‌రెడ్డికి కేసీఆర్‌ పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్ర రైతాంగ సంక్షేమానికి, వ్యవసాయ సంక్షోభం నివారణకు పోరాటాలు చేయాలని సూచించారు.


ఈ అంశాలపై ఇప్పటికే పార్టీ చేస్తున్న పోరాటాలను మరింత ఉధృతం చేయాలన్నారు. వానాకాలం నాట్లు అయిపోవస్తున్నా.. ఇంతవరకూ రైతాంగానికి సాగునీరు అందించలేని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజాక్షేత్రంలో నిలదీయాలని నేతలకు సూచించారు. కన్నేపల్లి పంప్‌హౌజ్‌ దగ్గర గోదావరి జలాలను ఎత్తిపోయాలని, పంపులను ఆన్‌ చేసి, చెరువులు, నీటి కుంటలను నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, నాట్లు పడుతున్న సమయంలో ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం క్షమించరాని నేరమని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. దీనిపై పరస్పర విమర్శలతో కాలయాపన చేస్తూ ప్రజాసమస్యలను గాలికొదిలేస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను గట్టిగా నిలదీయాలని సూచించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు బీఆర్‌ఎస్‌ విద్యార్ధి విభాగాన్ని బలోపేతం చేస్తున్నట్టుగానే.. మిగిలిన పార్టీ అనుబంధ వ్యవస్థలను కూడా బలోపేతం చేసి, క్షేత్రస్థాయి పోరాటంలో ప్రజలతో మమేకం చేయాలన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అనుసరించాల్సిన వ్యూహాలు, బీసీ రిజర్వేషన్లపై పార్టీ వైఖరికి సంబంధించి కూడా కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. బీజేపీలో బీఆర్‌ఎ్‌సను విలీనం చేస్తామని కేటీఆర్‌ అన్నట్లుగా ఎంపీ సీఎం రమేశ్‌ చేసిన వ్యాఖ్యలు సైతం ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉప ఎన్నికకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎంపికతోపాటు ఇతర పార్టీలు ఎవరిని బరిలో దించే అవకాశాలు ఉన్నాయనే అంశంపనైనా చర్చించారు.


ప్రజల్లోనే ఉండాలంటూ..

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలవుతున్న సంక్షేమ పథకాల లోటుపాట్లపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, పార్టీ శ్రేణులంతా క్షేత్రస్థాయిలో శ్రమించాలని కేసీఆర్‌ ఈ భేటీలో సూచించినట్లు తెలిసింది. ముఖ్యంగా గ్రామాల్లో నిధులు లేక పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైందని, వ్యవసాయ రంగం కూడా ఆశాజనకంగా లేదని.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లు డెడ్‌ స్టోరేజీలో ఉన్నాయనే విషయాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పినట్లుగా సమాచారం. కాగా తెలంగాణ ప్రజలకు ఏనాడైనా అండగా నిలబడేది బీఆర్‌ఎస్‌ పార్టీనేనని కేసీఆర్‌ స్పష్టం చేశారని ఆయన కార్యాలయం ఒక ప్రకటన ద్వారా తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి

సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట

హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 30 , 2025 | 04:31 AM