Share News

BRS Protest: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల వాకౌట్‌

ABN , Publish Date - Sep 01 , 2025 | 04:16 AM

అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాళేశ్వరం కమిషన్‌ నివేదిక ఏకపక్షమని, అందులో అబద్ధాలు ఉన్నాయని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. దీనిపై సభలో వివరణ ఇవ్వడానికి తమకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని ఆరోపిస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు.

BRS Protest: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల వాకౌట్‌

  • గన్‌పార్క్‌ వద్ద నిరసన.. ఘోష్‌ నివేదిక అంతా ట్రాష్‌

  • కాంగ్రెస్‌ కుట్రలను ఎండగడతామన్న కేటీఆర్‌, హరీశ్‌

  • చెత్త నివేదిక.. చిత్తుకాగితంతో సమానం

  • రాజ్యాంగం కల్పించిన హక్కుగా కోర్టుకెళ్తే తప్పేంటి?

  • ప్రభుత్వం నడుపుతున్నారా? సర్కస్‌ కంపెనీనా?: హరీశ్‌

  • ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ తరఫున ‘ఒకే ఒక్కడు’గా ప్రసంగం

హైదరాబాద్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాళేశ్వరం కమిషన్‌ నివేదిక ఏకపక్షమని, అందులో అబద్ధాలు ఉన్నాయని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. దీనిపై సభలో వివరణ ఇవ్వడానికి తమకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని ఆరోపిస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు. ఆదివారం రాత్రి అసెంబ్లీ నుంచి గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ కక్షపూరితంగా తీసుకొచ్చిన కాళేశ్వరం ఘోష్‌ కమిషన్‌ నివేదిక అంతా ట్రాష్‌ అని, అందులో ఉన్నవన్నీ అబద్ధాలేనని ఆరోపిస్తూ నివేదిక ప్రతులు చించి చెత్తబుట్టలో వేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మాట్లాడుతూ.. అసెంబ్లీలో తమ గొంతు నొక్కారని, స్పీకర్‌ ఏం సంబంధం లేనట్లు వ్యవహరించారని ఆరోపించారు. తమ నేత హరీశ్‌రావు ఒకరు మాట్లాడితే.. సీఎం సహా మంత్రులంతా అబద్ధాలు చెప్పారన్నారు. కాళేశ్వరంపై కుట్రను ప్రజల్లో ఎండగడతామని, ఆ ప్రాజెక్టును కూల్చి ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని కేటీఆర్‌ అన్నారు. కమిషన్స్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ చట్టాన్ని ఉల్లంఘించి కాళేశ్వరంపై పీసీ ఘోష్‌ ఇచ్చిన చెత్త నివేదికపై న్యాయపోరాటం చేస్తామని, దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయిస్తామన్నారు.


భట్టి ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాలకు దూరం: హరీశ్‌

బీఆర్‌ఎస్‌ హయాంలో ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపణలను రుజువు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటానని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో 17 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చినట్లు నిరూపిస్తే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. కాళేశ్వరంపై పీసీ ఘోష్‌ నివేదికపై అసెంబ్లీలో తాను మాట్లాడుతున్నప్పుడు సీఎంతోపాటు 8 మంది మంత్రులు తనను 33 సార్లు అడ్డుకున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సపై బురద చల్లి ఏ విధంగా ఓట్లు రాబట్టుకోవాలనే ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఘోష్‌ నివేదిక ఏకపక్షమని, ఎన్‌డీఏకు అనుకూలంగా ఎన్‌డీఎ్‌సఏ నివేదిక ఉందని అసెంబ్లీలో వివరించామన్నారు. గంటన్నర సేపు స్పీకర్‌ను, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రిని ప్రాధే యపడినా తమకు మైక్‌ ఇవ్వలేదని ఆరోపించారు. కోర్టులో కొట్టుకుపోతుందన్న భయంతోనే ఆదివారం అసెంబ్లీ పెట్టి కాళేశ్వరం కమిషన్‌పై చర్చ పెట్టారని ఆయన విమర్శించారు.

Updated Date - Sep 01 , 2025 | 04:16 AM