Share News

అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజు

ABN , Publish Date - Mar 14 , 2025 | 05:14 AM

భలో నిబంధనలకు విరుద్ధంగా ఏమీ మాట్లాడకపోయినా.. జగదీశ్‌రెడ్డిని ఉద్దేశపూర్వకంగా సభ నుంచి సస్పెండ్‌ చేశారని, అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజు

జగదీశ్‌రెడ్డిని సస్పెండ్‌ చేయడం దారుణం: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేటీఆర్‌, హరీశ్‌ రావు

  • అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన

  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అరెస్టు చేసి

  • తెలంగాణ భవన్‌ వద్ద వదిలిపెట్టిన పోలీసులు

హైదరాబాద్‌/ఖైరతాబాద్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): సభలో నిబంధనలకు విరుద్ధంగా ఏమీ మాట్లాడకపోయినా.. జగదీశ్‌రెడ్డిని ఉద్దేశపూర్వకంగా సభ నుంచి సస్పెండ్‌ చేశారని, అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌ నెక్లె్‌సరోడ్డులోని భారీ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద గురువారం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ మధుసూధనాచారి, వాణిదేవి, గోరేటి వెంకన్నతోపాటు వందలాది మంది నాయకులు నిరసన చేపట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ స్పీకర్‌ను ఉద్దేశించి జగదీశ్‌రెడ్డి అగౌరవంగా మాట్లాడలేదని, అనని మాటను అన్నట్లుగా చిత్రీకరించి సమావేశాలు పూర్తయ్యే వరకూ సస్పెండ్‌ చేయడం దారుణమన్నారు. తమ తప్పు ఉంటే క్షమాపణ చెప్పి, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటామని చెప్పినా.. పట్టించుకోకుండా సస్పెండ్‌ చేస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారన్నారు. ఢిల్లీలో రేవంత్‌రెడ్డి ప్లాన్‌ వేస్తే శాసనసభలో మంత్రి శ్రీధర్‌బాబు దాన్ని అమలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యం గొంతుకోసిందని ధ్వజమెత్తారు.


అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రజల సమస్యలపై మాట్లాడే అవకాశం ప్రతిపక్షాలకు లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీ స్పీకర్‌గా ప్రసాద్‌ను ప్రతిపాదించినప్పుడు బీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు కింద రూ.10లక్షల సాయం అందించిన ఘనత కేసీఆర్‌ది అని పేర్కొన్నారు. దళితులను ఓటు బ్యాంకుగా వాడుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. దళితుల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ఇలాంటి చర్యలు మానుకోకపోతే... భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. అనంతరం బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు అరెస్టుచేసి, ప్రత్యేక వాహనంలో తెలంగాణ భవన్‌ వద్ద వదిలిపెట్టారు. కాగా, సభను తప్పుదోవ పట్టించిన ఉత్తమ్‌ భేషరతుగా క్షమాపణలు చెప్పాలని ‘ఎక్స్‌’ వేదికగా హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. గతంలో మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వం రద్దు, గవర్నర్‌పై దాడి నేపథ్యంలో అప్పటి ఎమ్మెల్యేలు సంపత్‌కుమార్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిష్కరణను ఖండించిన ఉత్తమ్‌.. ఇప్పుడు జగదీశ్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. కాగా, నల్లగొండలోని గడియారం సెంటర్‌లో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకే ప్రభుత్వం కుట్ర పన్ని ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని సస్పెండ్‌ చేసిందని విమర్శించారు.

Updated Date - Mar 14 , 2025 | 05:14 AM