Bootleg Liquor: కువైత్‌లో కల్తీ సారా కలకలం
ABN , Publish Date - Aug 14 , 2025 | 04:41 AM
మద్య నిషేధం అమలులో ఉన్న ఇస్లామిక్ దేశం కువైత్‌లో కల్తీ సారా కలకలం రేపుతోంది. కల్తీ సారా కాటుకు రెండు రోజుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారని, వారిలో తెలుగువారు కూడా ఉన్నారని తెలుస్తోంది
పది మంది మృతి.. అందులో నలుగురు తెలుగువారు
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): మద్య నిషేధం అమలులో ఉన్న ఇస్లామిక్ దేశం కువైత్‌లో కల్తీ సారా కలకలం రేపుతోంది. కల్తీ సారా కాటుకు రెండు రోజుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారని, వారిలో తెలుగువారు కూడా ఉన్నారని తెలుస్తోంది. వారిలో ఒకరిని ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. తెలుగువారుగా భావిస్తున్న మరో ముగ్గురి వివరాలు తెలియవలసి ఉంది. జ్లీబ్‌లోని ఒక ప్రాంతంలో రెండు రోజులుగా కల్తీ సారా తాగి అస్వస్థతకు గురైన మొత్తం 15 మంది విదేశీయులు రెండు ఆస్పత్రుల్లో చేరారు. వారిలో బుధవారం వరకు పది మంది చనిపోయారని, ఒకరిద్దరికి కంటిచూపు పోయిందని సమాచారం. ఒక గదిలో ఉంటున్న ముగ్గురు భారతీయులు (ఒకరు తెలుగువాడు, ఇద్దరు తమిళులు) కల్తీ సారా బారినపడి మొదట ఆస్పత్రిలో చేరారు.
వారు ముగ్గురూ చికిత్స పొందుతూ మరణించారు. తర్వాత వేర్వేరుగా కల్తీ సారా తాగి మరికొందరు ఆస్పత్రుల పాలయ్యారు. మృతుల సంఖ్య పెరగవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, మద్య నిషేధం అమలులో ఉన్నందున కువైత్‌లో ఏ రకమైన కొనుగోళ్లు, విక్రయాలు, వినియోగం చేయరాదు. అయినా కువైత్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయులు, ఇతర విదేశీ కార్మికుల్లో కొందరు దొంగచాటుగా సారా తయారుచేసి, విక్రయిస్తుంటారు. సారా వినియోగంలో ఆంధ్రులు, తమిళులు ఎక్కువగా ఉంటారు. ప్రభుత్వం కొన్ని వారాలుగా దేశవ్యాప్తంగా చేపట్టిన వీసా తనిఖీల్లో భాగంగా ఈ తరహా అక్రమాలకు కళ్లెం వేసింది. దీంతో నాటుసారా ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థ కుప్పకూలింది. ఈ నేపథ్యంలో కల్తీ సారా దుర్ఘటనలు చోటుచేసుకున్నాయని తెలుస్తోంది.