Share News

BJP: బీజేపీ రాష్ట్ర కమిటీపై తర్జనభర్జన

ABN , Publish Date - Aug 17 , 2025 | 05:06 AM

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రాంచర్‌రావు నియామకమై నెల రోజులు గడుస్తున్నా.. రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై తర్జన భర్జనలు ఇంకా సాగుతూనే ఉన్నాయి.

BJP: బీజేపీ రాష్ట్ర కమిటీపై తర్జనభర్జన

  • అమిత్‌షా పరిశీలన తర్వాతే తుది నిర్ణయం

న్యూఢిల్లీ, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రాంచర్‌రావు నియామకమై నెల రోజులు గడుస్తున్నా.. రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై తర్జన భర్జనలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. పార్టీ అగ్ర నేతల ఆదేశాల మేరకు ఒక్కో పోస్టుకు మూడు నుంచి ఆరు పేర్లను సూచిస్తూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌కు రాంచందర్‌రావు ఓ జాబితాను సమర్పించినట్లు తెలిసింది. అయితే, తమను సంప్రదించకుండానే ఆ జాబితాను రూపొందించారంటూ ఎంపీలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌ రావు, డీకే అరుణ, అర్వింద్‌ తదితరులు ఫిర్యాదు చేయడంతో.. నియామక ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్‌ పడినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పాత, కొత్త అన్న తేడా లేకుండా అందరినీ కలుపుకొనిపోయే వారికి పదవులు ఇవ్వాలని, అన్నివర్గాలకు ప్రాతినిధ్యం దక్కేలా చూడాలని పార్టీ అగ్రనేతలు భావిస్తున్నట్లు తెలిసింది.


కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌తోపాటు ఇతర నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. జాబితాకు సంబంధించి పార్టీ ఎంపీలతో అమిత్‌షా చర్చించనున్నారని, ఆయా ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే వారం రాంచందర్‌రావు ఢిల్లీ వచ్చిన తర్వాత జాబితా ఖరారయ్యే అవకాశాలున్నట్లు చెబుతున్నాయి. రాష్ట్ర కమిటీలో ముగ్గురు లేదా నలుగురు ప్రధాన కార్యదర్శులు, ఆరుగురు లేదా ఎనిమిది మంది ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారి, మీడియా ఇన్‌చార్జి, ఐటీ ఇన్‌చార్జి ఉండే అవకాశం ఉంది.

Updated Date - Aug 17 , 2025 | 05:06 AM