Ramchander Rao: స్థానిక ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలి
ABN , Publish Date - Jul 14 , 2025 | 05:26 AM
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు సూచించారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సూచన
నేడు నల్గొండ, రేపు సూర్యాపేట జిల్లాల్లో పర్యటన
రాంనగర్/హైదరాబాద్, జూలై 13(ఆంధ్రజ్యోతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు సూచించారు. బీజేపీ సిద్ధాంతాలు, మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్లాలని చెప్పారు. ఆదివారం బీజేపీ అడిక్‌మెట్ డివిజన్ అధ్యక్షుడు పాశం సాయికృష్ణయాదవ్ ఆధ్వర్యంలో రాంచందర్‌రావును ఆయన నివాసంలో శాలువాకప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు తగిన ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. కాగా, ఆయన సోమవారం నుంచి రెండు రోజులపాటు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్నారు.
సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు నల్గొండలో వివిధ సంఘాలు, న్యాయవాదులు, వైద్యులతో, అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. మధ్యా హ్నం 3.30 గంటలకు సూర్యాపేటలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అక్కడ పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. రాత్రికి ఆయన స్వగ్రామం కోదాడ నియోజకవర్గంలోని నల్లబండగూడెంలో బస చేస్తారు. మంగళవారం అక్కడ రైతులతో సమావేశమవుతారు. ఉదయం 10 గంటలకు కోదాడలో రైతులతో, మధ్యాహ్నం 1.30గంటలకు చౌటుప్పల్‌లో పార్టీ కార్యకర్తలతో నిర్వహించే సమావేశాల్లో పాల్గొంటారు.