Share News

N Ramchander Rao: క్యాబినెట్‌ నింపితే కాంగ్రెస్‌‌లో కల్లోలమే

ABN , Publish Date - Jul 08 , 2025 | 04:31 AM

రాష్ట్ర క్యాబినెట్‌లో పెండింగ్‌లో ఉన్న మూడు బెర్త్‌లు ఖాళీగా ఉన్నంత వరకే అధికార పార్టీలో ఐక్యత కనిపిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు స్పష్టం చేశారు.

N Ramchander Rao: క్యాబినెట్‌ నింపితే కాంగ్రెస్‌‌లో కల్లోలమే

  • ముస్లింలకు నేతృత్వం వహించేందుకు ఒవైసీ తహతహ

  • అక్బరుద్దీన్‌ కాలేజీని వెంటనే కూల్చాలి: రాంచందర్‌రావు

హైదరాబాద్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర క్యాబినెట్‌లో పెండింగ్‌లో ఉన్న మూడు బెర్త్‌లు ఖాళీగా ఉన్నంత వరకే అధికార పార్టీలో ఐక్యత కనిపిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నాయకత్వం తెలివైందని, మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలను ఊరిస్తూ ఆశల పల్లకిలో ఊరేగిస్తోందని వ్యాఖ్యానించారు. మొన్న మూడు క్యాబినెట్‌ పదవులు ప్రకటించినప్పుడు కాంగ్రెస్‌లో ఎంత రచ్చ జరిగిందో చూశామని అన్నారు. మిగతా మూడింటిని భర్తీ చేసిన మరుక్షణం పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు రోడ్డునపడటం ఖాయమని, అందుకే అధినాయకత్వం వాటిని పెండింగ్‌లో పెట్టిందని అన్నారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక తమకు సవాల్‌ అని అన్నారు.


గత ఎన్నికల్లో బీజేపీ 25వేల ఓట్లు సాధించిందని, ఇప్పుడు సమీకరణాలు మారాయని అన్నారు. రాష్ట్ర బీజేపీ కొత్త కమిటీని 20 రోజుల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా ముస్లిం సామాజిక వర్గానికి నాయకుడు లేడని, దీనిని గుర్తించే అసదుద్దీన్‌ ఒవైసీ ముస్లింలకు నేతృత్వం వహించేందుకు తహతహలాడుతున్నారని పేర్కొన్నారు. ‘‘పాతబస్తీ సల్కం చెరువు భూమిలో ఉన్న అక్బరుద్దీన్‌ కాలేజీని ఎందుకు కూల్చరు..? ప్రభుత్వ భూములను కబ్జా చేసినా, దాదాగిరీ చేసినా, కరెంట్‌ బిల్లులు కట్టకపోయినా, తీవ్రవాదులకు ఆశ్రయమిచ్చినా.. వాళ్లకు రక్షణ కల్పిస్తామంటే చూస్తూ ఊరుకోవాలా..? తక్షణమే అక్బరుద్దీన్‌ కాలేజీని కూల్చివేయాలి. లేకుంటే బీజేపీ ఆ పనిచేస్తుంది’’ అని హెచ్చరించారు.

Updated Date - Jul 08 , 2025 | 04:31 AM