Share News

BJP: దేశ విభజనకు కాంగ్రెస్‌ కుట్ర

ABN , Publish Date - Mar 14 , 2025 | 05:39 AM

ఉత్తరాది, దక్షిణాది పేరిట దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్‌ కుట్ర పన్నిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ మండిపడ్డారు. దేశ సమైక్యత, సమగ్రతకు భంగం కలిగించేలా ఆ పార్టీ ముఖ్యమంత్రులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

BJP: దేశ విభజనకు కాంగ్రెస్‌ కుట్ర

  • డీలిమిటేషన్‌పై రేవంత్‌ వ్యాఖ్యలు గర్హనీయం: బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌

హైదరాబాద్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాది, దక్షిణాది పేరిట దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్‌ కుట్ర పన్నిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ మండిపడ్డారు. దేశ సమైక్యత, సమగ్రతకు భంగం కలిగించేలా ఆ పార్టీ ముఖ్యమంత్రులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఏర్పాటు చేయనున్న సమావేశానికి హాజరవుతానంటూ సీఎం రేవంత్‌ చేసిన ప్రకటనపై రాహుల్‌ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దక్షిణాదిపై బీజేపీ కుట్ర పన్నుతోందని, డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టమని రేవంత్‌ మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయికి తగదన్నారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ తరఫున, అదే విధంగా ప్రభుత్వం తరఫున అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పడం కాంగ్రెస్‌ దురుద్దేశాన్ని తెలియజేస్తోందని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, జానారెడ్డి నాయకత్వంలో ఏర్పాటు చేసేది ప్రభుత్వ కమిటీనా..? లేక కాంగ్రెస్‌ ఏర్పాటు చేసుకున్న కమిటీనా..? ముఖ్యమంత్రి చెప్పాలని లక్ష్మణ్‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.


స్టాలిన్‌ సొంత కరెన్సీ కోరుకుంటున్నారా: సుభాష్‌

తమిళనాడు ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో రూపీ గుర్తును తమిళ లిపిలో ప్రచురించడం సరికాదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌.వి.సుభాష్‌ అన్నారు. ‘మీరు సొంత కరెన్సీ కోరుకుంటున్నారా..? ఇదేమి రాజకీయం..?’ అని నిలదీశారు. డీఎంకే ప్రభుత్వ చర్య జాతి వ్యతిరేకమని సుభాష్‌ ఒక ప్రకటనలో మండిపడ్డారు.

Updated Date - Mar 14 , 2025 | 05:39 AM