Raghunandan Rao: రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలీలో 71,977 దొంగ ఓట్లు
ABN , Publish Date - Aug 15 , 2025 | 05:01 AM
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీ నియోజకవర్గంలో 71,977 దొంగ ఓట్లు ఉన్నట్లు తేలిందని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు.
రాహుల్ ఎన్నికను రద్దు చేయాలని ఈసీని కోరతాం: రఘునందన్
హైదరాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీ నియోజకవర్గంలో 71,977 దొంగ ఓట్లు ఉన్నట్లు తేలిందని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. ‘‘రాయ్‌బరేలీలో 2లక్షల ఓట్లపై మాకు అనుమానం ఉంది. మా కార్యకర్తలతో వెరిఫికేషన్ చేయిస్తే 71,977 ఇళ్ల చిరునామాలు నకిలీవని తేలింది. అందుకే రాహుల్ ఎన్నికను రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరబోతున్నాం’’ అని చెప్పారు. ఈవీఎంలపై విశ్వాసం లేకుంటే వెంటనే రాజీనామా చేసి బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికకు వెళ్లాలని రాహుల్‌ను సవాల్ చేశారు. ‘‘నేను ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ పార్లమెంటులో కూడా దొంగ ఓట్లు ఉన్నాయి. సదాశివపేట, ఇస్నాపూర్, ఐలాపూర్ ప్రాంతాల్లో సుమారు వెయ్యి దొంగ ఓట్లను గుర్తించాం. వయనాడ్‌లో ఒకే వర్గానికి చెందిన 93,499 మంది ఓట్లతో ప్రియాంక గాంధీ గెలిచారు.
మమతా బెనర్జీ, డింపుల్, అఖిలేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపైన కూడా అనుమానంగా ఉంది. రాహుల్ గాంధీకి ఇవి ఎందుకు కనిపించడం లేదు’’ అని ప్రశ్నించారు. గురువారం రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ దేశంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తికి దేశంలోని ఏ వ్యవస్థపైనా నమ్మకం లేకపోవడం బాధాకరం. రాజీవ్ గాంధీ 1989లో కాంగ్రెస్ ఓటమి తర్వాత బ్యాలెట్ పేపర్లు మంచివి కావని, ఈవీఎంలను తీసుకురావాలని నిర్ణయించారు. ఆయన కుమారుడు రాహులేమో ఈవీఎంలను వద్దంటున్నారు. 20వ శతాబ్దంలో దేశానికి కంప్యూటర్ పరిచయం చేసిన నాన్న ఆలోచన ప్రోగ్రెసివ్.. కొడుకు ఆలోచనేమో డిస్ట్రక్టివ్’’ అని ఎద్దేవా చేశారు.
రాహుల్‌పై మాట్లాడే స్థాయి రఘునందన్‌కు లేదు: అద్దంకి
హరీశ్‌తో ఒప్పందం చేసుకుని బీఆర్‌ఎస్ సహకారం తీసుకుని ఎంపీగా గెలిచిన రఘునందన్‌కు రాహుల్‌పై మాట్లాడే స్థాయి లేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. పెద్దవాళ్లపై మాట్లాడితే పెద్దోడినైపోతానని రఘునందన్ అనుకుంటున్నారని, కానీ బీజేపీలోనే ఆయనకు ఆధారం లేదని అన్నారు.