Pawan Kheda: ఖేడా భార్య నీలిమకూ రెండు ఓటరు ఐడీలు
ABN , Publish Date - Sep 04 , 2025 | 05:10 AM
కాంగ్రెస్ నేత పవన్ ఖేడాకే కాదు ఆయన భార్య కోట నీలిమకు కూడా రెండు ఓటరు ఫొటో గుర్తింపు కార్డులు (ఎపిక్‌లు) ఉన్నాయని బీజేపీ ఆరోపించింది.
ఒకటి ఖైరతాబాద్‌లో.. మరొకటి ఢిల్లీలో...
కోటరీలోని నాయకుల నేరాల నుంచి రాహుల్ గాంధీ తప్పించుకోలేరు: బీజేపీ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 3: కాంగ్రెస్ నేత పవన్ ఖేడాకే కాదు ఆయన భార్య కోట నీలిమకు కూడా రెండు ఓటరు ఫొటో గుర్తింపు కార్డులు (ఎపిక్‌లు) ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. నీలిమకు ఖైరతాబాద్ (తెలంగాణ), ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేర్వేరు నంబర్లతో ఓటరు ఐడీలు ఉన్నాయని బీజేపీ ఐటీ విభాగం హెడ్ అమిత్ మాలవీయ బుధవారం ‘ఎక్స్’లో పేర్కొంటూ అసలు ఓట్ల దొంగ కాంగ్రెస్సేనని విమర్శించారు. తన కోటరీలోని నాయకులు పాల్పడుతున్న నేరాల నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. నీలిమ 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
సీడబ్ల్యూసీ సభ్యుడు, కాంగ్రెస్ మీడియా విభాగం ఇన్‌చార్జి అయిన పవన్ ఖేడాకు ఢిల్లీ, జంగ్‌పురా అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు ఓటరు ఐడీలు ఉన్నాయని బీజేపీ మంగళవారం ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆయనకు నోటీసులు జారీ చేసింది. అయితే ఒకచోట తన పేరు తొలగించాలని 2016లో దరఖాస్తు చేశానని, కానీ ఈసీ తొలగించలేదన్న విషయం బీజేపీ ఆరోపణల వల్లే తెలిసిందని ఖేడా పేర్కొన్నారు.