Bhatti Vikramarka: ఏపీహెచ్‌ఎంఈఎల్ ప్రపంచంతో పోటీ పడాలి
ABN , Publish Date - Aug 15 , 2025 | 03:56 AM
ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ ఇంజినీరింగ్ లిమిటెడ్(ఏపీహెచ్‌ఎంఈఎల్) ఎదగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క అన్నారు.
విజయవాడలో సంస్థను సందర్శించిన భట్టి
విజయవాడ, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ ఇంజినీరింగ్ లిమిటెడ్(ఏపీహెచ్‌ఎంఈఎల్) ఎదగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క అన్నారు. విజయవాడకు సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న సింగరేణి అనుబంధ సంస్థ ఏపీహెచ్‌ఎంఈఎల్‌ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికులతో మాట్లాడారు. అనంతరం భట్టి మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమల కొత్త విడిభాగాల తయారీ, పాత విడిభాగాలకు మరమ్మతు చేసి సరఫరా చేస్తున్న ఇంజినీరింగ్ సంస్థలకు ఏపీహెచ్‌ఎంఈఎల్ కన్నా మంచి యంత్రాలు, మానవ వనరులు లేవని అన్నారు.
సంస్థను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు త్వరలోనే ఒక కన్సల్టెన్సీని నియమిస్తామని, వారు స్థానిక పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక ఇస్తారని తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా సంస్థ అభివృద్ధికి ఏం చేయాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ పరిశ్రమ సింగరేణికి అవసరమైన యంత్రాలను తయారు చేయడం, మరమ్మతు వరకే పరిమితం కాకుండా భవిష్యత్తులో రాష్ట్రం, దేశానికి అవసరమైన ఆర్డర్లను తీసుకుని బీహెచ్‌ఈఎల్ తరహాలో పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.