Share News

Bhatti Vikramarka: ఉపాధి పథకాలు, ఇందిరమ్మ ఇళ్లకు విరివిగా రుణాలివ్వాలి

ABN , Publish Date - Sep 09 , 2025 | 05:06 AM

స్వయం ఉపాధి పథకాలు, ఇందిరమ్మ ఇళ్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలివ్వాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బ్యాంకర్లకు సూచించారు.

Bhatti Vikramarka: ఉపాధి పథకాలు, ఇందిరమ్మ ఇళ్లకు విరివిగా రుణాలివ్వాలి

  • రైతులకు రుణాలివ్వడంలో మానవీయ కోణంలో ఆలోచించాలి.. ఆస్తుల తాకట్టు, డిపాజిట్ల పేరుతో రైతులపై ఒత్తిడి తేవొద్దు

  • రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ

  • భేటీలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): స్వయం ఉపాధి పథకాలు, ఇందిరమ్మ ఇళ్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలివ్వాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బ్యాంకర్లకు సూచించారు. సోమవారం ప్రజాభవన్‌లో జరరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో భట్టి మాట్లాడారు. రుణాలిచ్చే సమయంలో ఆస్తులను తాకట్టు పెట్టాలని, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేయండంటూ రైతులపై ఒత్తిడి చేయొద్దని చెప్పారు. ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా భావిస్తోందని పేర్కొన్నారు. రైతులకు సకాలంలో పంట రుణాలు ఇవ్వాలని, ఈ విషయంలో బ్యాంకర్లు మానవీయ కోణంలో ఆలోచించాలని అన్నారు. ‘తెలంగాణ రైజింగ్‌’లో బ్యాంకర్ల పాత్ర ఉందని, 2025-26 ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో బ్యాంకులు ప్రాధాన్య రంగ రుణాల్లో మంచి ఫలితాలు సాధించాయని తెలిపారు. వార్షిక రుణ ప్రణాళిక(ఏసీపీ)లో మొదటి త్రైమాసికంలోనే 33.64ు ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు.


రైతు రుణమాఫీ పథకంలో భాగంగా కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ఖాతాలను గణనీయంగా పునరుద్ధరించామని పేర్కొన్నారు. వరి ఉత్పత్తి పెరగడంతో... ఎఫ్‌సీఐకి ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని సరఫరా చేసే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఎదిగిందన్నారు. ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తోందని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు సాధికారత కల్పిస్తున్నామని, వారికి బ్యాంకులు మరింత రుణ సహాయం అందించాలన్నారు. రాష్ట్రంలో మొదటి సంవత్సరం 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తున్నామని.. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షలను ఖర్చు చేస్తోందని, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను కోరారు. స్వయం ఉపాధి పథకాల ద్వారా లబ్ధి పొందాలని ఆశిస్తున్న యువకుల పట్ల బ్యాంకర్లు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలన్నారు.

Updated Date - Sep 09 , 2025 | 05:06 AM