Bhatti Vikramarka: మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రమే లక్ష్యం
ABN , Publish Date - Jul 18 , 2025 | 04:26 AM
రాష్ట్రంలోని మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, మహిళలు ఆర్థికంగా బలోపేతమైనప్పుడే లింగ వివక్ష దూరమవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
అతివలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తున్నాం
నిజాం కాలేజీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : భట్టి
హైదరాబాద్/బర్కత్‌పుర, జూలై 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, మహిళలు ఆర్థికంగా బలోపేతమైనప్పుడే లింగ వివక్ష దూరమవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నిజాం కళాశాలలో రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన లింగ సమానత్వం సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఏటా మహిళా సంఘాలకు రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను ఇస్తున్నామని తెలిపారు.
మొదటి ఏడాదిలోనే రూ.21,632 కోట్ల రుణాలను అందించామని చెప్పారు. ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు మహిళలకు చేరితే ఆర్థిక స్వాతంత్య్రం, లింగ సమానత్వం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి, సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయిస్తున్నామని తెలిపారు. ఆ విద్యుత్తును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు మహిళా సంఘాల ద్వారా 650 బస్సులను కొనుగోలు చేయించి, ఆర్టీసీకి అద్దెకు ఇప్పించామని అన్నారు. నిజాం కళాశాల సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని, పూర్వ విద్యార్థిగా ఒక రోజు కళాశాలలో గడపాలని నిర్ణయించుకున్నానని భట్టి తెలిపారు.