Bhatti Vikramarka: గడువులోగా ప్రాజెక్టులు నిర్మించాలి: భట్టి
ABN , Publish Date - Jun 29 , 2025 | 03:49 AM
రాష్ట్రంలో సింగరేణి కాలరీస్ సంస్థ నిర్మించతలపెట్టిన పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్లకు నిర్ణీత గడువులోగా సంబంధిత శాఖల అనుమతులు తీసుకు ని నిర్మాణ పనులు ప్రారంభించాలని ఉప మఖ్యమంత్రి భట్టివిక్రమార్క సంస్థ యాజమాన్యాన్ని ఆదేశించారు.
హైదరాబాద్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సింగరేణి కాలరీస్ సంస్థ నిర్మించతలపెట్టిన పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్లకు నిర్ణీత గడువులోగా సంబంధిత శాఖల అనుమతులు తీసుకు ని నిర్మాణ పనులు ప్రారంభించాలని ఉప మఖ్యమంత్రి భట్టివిక్రమార్క సంస్థ యాజమాన్యాన్ని ఆదేశించారు. ప్రజాభవన్‌లో శనివారం పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. లోయర్ మానేరు డ్యామ్‌లో 300 మెగావాట్లు, మల్లన్నసాగర్‌లో 500 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల నిర్మాణానికి నీటిపారుదలశాఖ అనుమతులు వీలైనంత త్వరగా తీసుకోవాలని ఆదేశించారు.
అయిదు జిల్లాల్లో నిర్మించతలపెట్టిన 500 మెగావాట్ల పవన విద్యుత్తు ప్లాంట్ల డీపీఆర్‌ను జూలై నెలాఖరుకల్లా పూర్తి చేయాలన్నారు. రామగుండంలో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు తక్షణమే చేపట్టాలని సూచించారు. ప్రాజెక్టుల పురోగతిని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. కాగా, ఇటీవల ఓ ప్రమాదంలో సింగరేణి కార్మికుడు పెండ్రి రంజిత్ కుమా ర్ మృతి చెందగా అతడి కుటుంబానికి రూ.1.20 కోట్ల ప్రమాద బీమా చెక్కును ఉప ముఖ్యమంత్రి అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ డీజీఎం నీలాక్షి సింగ్, రీజినల్ మేనేజర్ సురేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.