Share News

Bhatti Vikramarka: డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుదుత్పత్తి ఉండాలి

ABN , Publish Date - Jun 28 , 2025 | 04:33 AM

రాబోయే ఐదు, పదేళ్ల కాలంలో విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన ప్రణాళికలు చేసుకొని ముందుకెళ్లాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

Bhatti Vikramarka: డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుదుత్పత్తి ఉండాలి

  • అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష

  • ఫ్లోటింగ్‌ సోలార్‌ కోసం సమన్వయ కమిటీని ఏర్పాటుచేయాలని సూచన

హైదరాబాద్‌, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): రాబోయే ఐదు, పదేళ్ల కాలంలో విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన ప్రణాళికలు చేసుకొని ముందుకెళ్లాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త పరిశ్రమల రాక, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలతో విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరుగుతోందన్నారు. 2035నాటికి థర్మల్‌ విద్యుత్తుకు ఉండే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని 50 ఏళ్ల కిందట కట్టిన రామగుండం, కేటీపీఎస్‌ థర్మల్‌ పవర్‌ ేస్టషన్ల స్థానంలో కొత్తవాటిని నిర్మించడానికి ప్రణాళికలు సిద్థం చేయాలని అధికారులకు సూచించారు.


కొత్తగూడెం, రామగుండంలో కాలం చెల్లిన ప్లాంట్ల స్థానంలో 800మెగావాట్ల చొప్పున నూతన థర్మల్‌ ప్లాంట్లను నిర్మించే అవకాశం ఉందన్నారు. థర్మల్‌ ప్లాంట్లన్నీ జెన్‌కో ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నామని, ఈ నేపథ్యంలో నూతన డైరెక్టర్లు అందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లపై రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసి, ఆయా వర్గాలకు ఆదాయంతో పాటు సోలార్‌ విద్యుత్‌ అందించడానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. నీటిపై తేలియాడే విద్యుత్‌ ప్లాంట్ల కోసం నీటిపారుదలశాఖ, జెన్‌కోతో సమన్వయం చేసుకోవడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.

Updated Date - Jun 28 , 2025 | 04:33 AM