Share News

Bhatti Vikramarka: జాబ్‌ క్యాలెండర్‌ రీ షెడ్యూల్‌!

ABN , Publish Date - Jul 02 , 2025 | 04:25 AM

జాబ్‌ క్యాలెండర్‌ రీ షెడ్యూల్‌పై అతి త్వరలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క... టీజేఎస్‌ అధినేత, ఎమ్మెల్సీ కోదండరాం, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రియాజ్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్‌కు తెలిపారు.

Bhatti Vikramarka: జాబ్‌ క్యాలెండర్‌ రీ షెడ్యూల్‌!

  • త్వరలో సమీక్ష.. వెంటనే భర్తీకి వీలున్న ఖాళీల గుర్తింపు: భట్టి

హైదరాబాద్‌, జూలై 1(ఆంధ్రజ్యోతి): జాబ్‌ క్యాలెండర్‌ రీ షెడ్యూల్‌పై అతి త్వరలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క... టీజేఎస్‌ అధినేత, ఎమ్మెల్సీ కోదండరాం, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రియాజ్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్‌కు తెలిపారు. వెంటనే భర్తీ చేయడానికి వీలున్న పోస్టులనూ ఈ సమావేశంలో గుర్తించనున్నట్లు భట్టి చెప్పారు. మంగళవారం కోదండరాం, రియాజ్‌, దయాకర్‌ ప్రజాభవన్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి, భట్టిలను కలిశారు. జాబ్‌ క్యాలెండర్‌ను రీషెడ్యూల్‌ చేసి ఉద్యోగాల భర్తీకి త్వరితగతిన నోటిఫికేషన్లు జారీ చేయాలని కోరారు. విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలను కూడా వారి దృష్టికి తెచ్చారు.


ఈ అంశాలపై సీఎం రేవంత్‌ సానుకూలంగా స్పందించారు. ఎస్సీ వర్గీకరణ, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించే క్రమంలో నోటిఫికేషన్లు కాస్త ఆలస్యమయ్యాయని, అవి పూర్తయినందున నోటిఫికేషన్ల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందన్నారు. పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాల్సింది ఆర్థిక శాఖ అని, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో మాట్లాడాలని సూచించారు. ఈ సందర్భంగా వారితో భట్టి మాట్లాడుతూ వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి అతి త్వరలోనే సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. జాబ్‌ క్యాలెండర్‌ రీషెడ్యూల్‌ పైనా కసరత్తు జరుగుతుందని హామీ ఇచ్చారు. కాగా, భట్టి సమీక్ష వారం రోజుల్లోపే ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Jul 02 , 2025 | 04:25 AM