Share News

BC Reservation: మంత్రుల కమిటీ నివేదిక ఆలస్యం

ABN , Publish Date - Aug 27 , 2025 | 04:10 AM

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించే అంశంపై మంత్రుల కమిటీ.. టీపీసీసీకి నివేదిక ఇవ్వడం కొంత ఆలస్యం కానుంది.

BC Reservation: మంత్రుల కమిటీ నివేదిక ఆలస్యం

  • జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, అభిషేక్‌ సింఘ్వీతో సంప్రదింపుల్లో బీసీలకు 42శాతంపై రాని స్పష్టత!

  • మరికొందరు నిపుణులతో చర్చించనున్న కమిటీ

  • క్యాబినెట్‌ భేటీలోపు నివేదిక సమర్పించే అవకాశం

హైదరాబాద్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించే అంశంపై మంత్రుల కమిటీ.. టీపీసీసీకి నివేదిక ఇవ్వడం కొంత ఆలస్యం కానుంది. హైదరాబాద్‌లో ఆదివారం ఆడిటర్‌ జనరల్‌తో, ఢిల్లీలో సోమవారం జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, ప్రముఖ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీతో మంత్రుల కమిటీ సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే. అయితే ఈ భేటీలో స్పష్టత రాకపోవడంతో మరికొందరు న్యాయ నిపుణుల అభిప్రాయాలనూ తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. వాస్తవానికి టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు న్యాయనిపుణులతో మంత్రుల కమిటీ సంప్రదింపులు పూర్తి చేసి మంగళవారం కల్లా టీపీసీసీకి నివేదిక సమర్పించాల్సి ఉంది. అయితే మరికొందరు నిపుణులనూ సంప్రదించాలన్న నిర్ణయం నేపథ్యంలో నివేదిక సమర్పణ ఒకటి, రెండు రోజులు ఆలస్యం కానుంది.


శాసనసభ తీర్మానం ఆధారంగా జీవో ఇచ్చి ముందుకు వెళ్లాలా? లేక పార్టీ పరంగా నిర్ణయం తీసుకుని వెళ్లాలా? అన్నదానిపైన స్పష్టత రాకపోవడం వల్లనే మంత్రుల కమిటీ విస్తృత అభిప్రాయ సేకరణ చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ నెల 30న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ లోపే మంత్రుల కమిటీ.. అభిప్రాయ సేకరణ పూర్తి చేసి నివేదికను పార్టీకి సమర్పించనుందని, ఆ నివేదికపై టీపీసీసీ కోర్‌ కమిటీ సమావేశమై ఒక నిర్ణయానికి రానుందని అంటున్నారు. కోర్‌ కమిటీలో తీసుకున్న నిర్ణయానుసారం.. ప్రభుత్వ పరంగా క్యాబినెట్లో నిర్ణయం జరగనుందని చెబుతున్నారు.

Updated Date - Aug 27 , 2025 | 04:10 AM