Share News

BC Bandh Success: బీసీ బంద్‌ సక్సెస్‌!

ABN , Publish Date - Oct 19 , 2025 | 04:27 AM

బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత, రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు డిమాండ్‌తో బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్‌ శనివారం విజయవంతంగా జరిగింది....

BC Bandh Success: బీసీ బంద్‌ సక్సెస్‌!

  • పల్లె నుంచి పట్నం దాకా విద్యా సంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూత

  • బంద్‌కు కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌, లెఫ్ట్‌ మద్దతు

  • రాష్ట్రవ్యాప్తంగా పోటాపోటీగా ర్యాలీలు, ధర్నాలు

  • ఎంజీబీఎస్‌ వద్ద 12 గంటల పాటు బైఠాయింపు

  • పండుగపూట సొంతూళ్లకు వెళ్లేవారికి తప్పని తిప్పలు

  • కొన్ని ప్రాంతాల్లో వ్యాపార సంస్థలపై రాళ్ల దాడి

  • అడ్డుకున్న పోలీసులు.. ఆయా చోట్ల ఉద్రిక్తత

  • స్థానిక ఎన్నికలను ఆపి మరీ బీసీ రిజర్వేషన్ల కోసం 23 నెలలుగా ప్రయత్నిస్తున్నాం: మహేశ్‌గౌడ్‌

  • బీసీ బంద్‌ చరిత్రలో నిలిచిపోతుంది

  • త్వరలో అన్ని రాజకీయ పక్షాలతో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందిస్తాం: ఆర్‌.కృష్ణయ్య

  • అఖిలపక్షంతో సీఎం ఢిల్లీకి వెళ్లి ఒత్తిడి తేవాలి: జాజుల

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత, రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు డిమాండ్‌తో బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్‌ శనివారం విజయవంతంగా జరిగింది. పలుచోట్ల చిన్న చిన్న సమస్యలు మినహా దాదాపు ప్రశాంతంగా జరిగింది. బీసీ సంఘాల జేఏసీ పిలుపునిచ్చిన ఈ బంద్‌కు కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌, వామపక్షాలు, ఇతర పార్టీలు సైతం మద్దతు ప్రకటించడంతో సంపూర్ణంగా జరిగింది. పార్టీలకు అతీతంగా బీసీ నాయకులంతా రోడ్లపైకి వచ్చి రిజర్వేషన్ల కోసం గళమెత్తారు. ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. విద్యా సంస్థలన్నీ ముందుగానే సెలవు ప్రకటించాయి. ప్రైవేట్‌ సంస్థలు, వర్తక, వాణిజ్య సముదాయాలు, దుకాణాల వారు స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు. కొన్నిచోట్ల తెరిచి ఉన్న దుకాణాలు, వ్యాపార సంస్థలను ఆందోళనకారులు బలవంతంగా మూయించారు. రాళ్లదాడులు, విధ్వంసానికి పాల్పడ్డారు. పలుచోట్ల బీసీ రిజర్వేషన్ల అమలుకు అడ్డుపడుతున్నారంటూ కాంగ్రెస్‌, బీజేపీల శ్రేణులు పరస్పరం పోటాపోటీ ప్రదర్శనలకు దిగాయి. ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రజా రవాణా స్తంభించింది. దీపావళి సెలవులు రావడంతో రాజధాని హైదరాబాద్‌, ఇతర పట్టణాల నుంచి సొంతూర్లకు వెళ్లాలనుకున్న ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. దీంతో ప్రైవేటు వాహనాల వారు రెండు, మూడింతల చార్జీ వసూలు చేశారు. యాదగిరిగుట్టలో ఉచిత బస్సులు కూడా లేకపోవడంతో భక్తులు ఆటోల్లో కొండపైకి వెళ్లాల్సి వచ్చింది.


రాజధానిలో గరం గరం

ఎంజీబీఎస్‌ వద్ద జరిగిన నిరసనల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌తో పాటు పలువురు బీసీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాగా, హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో ర్యాలీ చేస్తుండగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ కిందపడిపోయారు. ఇక వామపక్షాల నేతలు కె.నారాయణ, కూనంనేని సాంబశివరావు, కార్యదర్శి జాన్‌వెస్లీ, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌, ప్రజా సంఘాల నేతలు నారాయణగూడ నుంచి అబిడ్స్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో బీఆర్‌ఎస్‌ నేతలు తలసాని, గంగుల కమలాకర్‌, శ్రీనివా్‌సగౌడ్‌, వద్దిరాజు రవిచంద్ర తదితరులు బైఠాయించి నిరసన తెలిపారు. ఇక తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌ చౌరస్తాలో మానవహారం నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. జాగృతి అధ్యక్షురాలు కవితతో పాటు ఆమె కుమారుడు ఆదిత్య కూడా ఆందోళనలో పాల్గొన్నారు. జూబ్లీ బస్టాండ్‌ వద్ద ఎంపీ ఈటెల రాజేందర్‌, బీజేపీ నేతలు రహదారిపై బైఠాయించారు. బర్కత్‌పుర బస్‌డిపో ఎదుట ఎంపీ ఆర్‌.కృష్ణయ్య, బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ ధర్నా చేశారు.

బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే..

బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఆపి మరీ, బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం 23 నెలలుగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. బంద్‌కు మద్దతు పలికిన పార్టీలన్నీ, రిజర్వేషన్ల పెంపునకు కేంద్రం ఆమోదించేవరకు మద్దతుగా నిలవాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు కోరారు. బీసీ బంద్‌ చరిత్రలో నిలిచిపోతుందని బీసీ జేఏసీ చైర్మన్‌, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య పేర్కొన్నారు. తమకు మద్దతు ఇచ్చిన పార్టీలు, ప్రజా సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో అన్ని రాజకీయ పక్షాలతో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇక అందరి సహకారంతో బంద్‌ విజయవంతమైందని, ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేసి బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్‌ అఖిలపక్షంతో ఢిల్లీవెళ్లి ఒత్తిడి తేవాలన్నారు. సీఎం రేవంత్‌ ఒక రెడ్డి బిడ్డ అయినప్పటికీ చాలెంజ్‌గా తీసుకొని అసెంబ్లీలో బిల్లు ఆమోదింపజేశారని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.


పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలతో..

హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో ఓ బంగారం దుకాణం, నల్లకుంటలో ఒక పెట్రోల్‌ బంక్‌, హోటల్‌, బజాజ్‌ ఎలకా్ట్రనిక్స్‌ షోరూమ్‌పై నిరసనకారులు రాళ్లు విసిరారు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోదరుడికి సంబంధించిన పవన్‌ మోటార్స్‌ షోరూంపై కొందరు రాళ్లదాడి చేయడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. పరిగిలో హైదరాబాద్‌- బీజాపూర్‌ జాతీయ రహదారిపై బీసీ నేతలు బైఠాయించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో కాంగ్రెస్‌, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. పరస్పరం దూసుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు నిలువరించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో బీజేపీ, మిగతా పక్షాల నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్తంగా మారింది. జఫర్‌గడ్‌ మండల కేంద్రంలో వామపక్షాలు, బీజేపీ నేతలు పోటాపోటీగా దిష్టిబొమ్మలను దహనం చేశారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో బీసీ నేతల దాడిలో ఓ కంగన్‌హాల్‌ నిర్వాహకురాలు, ఆమె భర్తకు గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు బాహాబాహీకి దిగడంతో బీజేపీ పట్టణాధ్యక్షుడు బానోత్‌ విజయ్‌కు గాయాలయ్యాయి.

5.jpg2.jpg4.jpg3.jpg

Updated Date - Oct 19 , 2025 | 04:27 AM