Share News

Smart Cooker: చక్కెర వ్యాధిని నియంత్రించే స్మార్ట్‌ కుక్కర్‌!

ABN , Publish Date - Apr 26 , 2025 | 05:33 AM

మధుమేహ రోగులకు, ఊబకాయం ఉన్నవారికి ఉపయోగపడేలా బాపట్ల శాస్త్రవేత్త రూపొందించిన స్మార్ట్‌ కుక్కర్‌కు పేటెంట్‌ లభించింది.

Smart Cooker: చక్కెర వ్యాధిని నియంత్రించే స్మార్ట్‌ కుక్కర్‌!

  • బాపట్ల శాస్త్రవేత్త అద్భుత ఆవిష్కరణకు పేటెంట్‌

బాపట్ల, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): మధుమేహ రోగులకు, ఊబకాయం ఉన్నవారికి ఉపయోగపడేలా బాపట్ల శాస్త్రవేత్త రూపొందించిన స్మార్ట్‌ కుక్కర్‌కు పేటెంట్‌ లభించింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని బాపట్ల వ్యవసాయ కళాశాలకు సంబంధించిన కోత అనంతర పరిజ్ఞాన కేంద్రం (పోస్ట్‌ హార్వెస్ట్‌ టెక్నాలజీ సెంటర్‌) సీనియర్‌ శాస్త్రవేత్త దోనేపూడి సందీప్‌ రాజా ఈ స్మార్ట్‌ కుక్కర్‌ను రూపొందించారు. దేశంలోనే తొలిసారిగా రూపొందించిన ఈ స్మార్ట్‌ కుక్కర్‌కు మూడు రోజుల క్రితమే పేటెంట్‌ వచ్చిందని, త్వరలోనే ఇది మార్కెట్‌లోకి విడుదలవుతుందని అధికారులు తెలిపారు. గ్లైసెమిక్‌ ఇండెక్స్‌(జీఐ) స్థాయిలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఉదాహరణకు మనం రోజూ తినే వైట్‌ రైస్‌లో జీఐ స్థాయిలు అధికంగా ఉంటాయి. అయితే ఈ స్మార్ట్‌ కుక్కర్‌లో బియ్యాన్ని ఉడికించడం వల్ల జీఐ తగ్గుతుంది.


దీంతో మధుమేహ రోగులకు చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ రైస్‌ కుక్కర్‌ మధుమేహ రోగులకే కాదు.. ఊబకాయం ఉన్నవారికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అన్నంలోని గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ను తగ్గించి నెమ్మదిగా జీర్ణమయ్యేలా చేయడమే డయాబెటిక్‌ స్మార్ట్‌ రైస్‌ కుక్కర్‌ ప్రత్యేకత అని సందీప్‌ రాజా తెలిపారు. ఇందులో వండిన అన్నం తింటే అరుగుదల నిధానంగా జరిగి రక్తంలో చక్కెరస్థాయి పెరగకుండా చేస్తుందని చెప్పారు. అలాగే జీవక్రియ కూడా మెరుగవుతుందని, శరీర బరువును కూడా నియంత్రణలో ఉంచుతుందని పేర్కొన్నారు. ఈ స్మార్ట్‌కుక్కర్‌ను మొబైల్‌ యాప్‌తో కూడా నియంత్రించవచ్చన్నారు. కాగా, గతేడాది సందీప్‌ రాజా రూపొందించిన రెండు పరికరాలకు కూడా పేటెంట్‌ లభించింది.

Updated Date - Apr 26 , 2025 | 05:33 AM