Share News

Bandi Sanjay: మేం అధికారంలోకి వస్తే బీసీనే సీఎం

ABN , Publish Date - Jul 01 , 2025 | 04:30 AM

బీజేపీ బాజాప్త ఒక్కటే మాట చెప్పింది.. తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే బీసీ నాయకుడే సీఎం అవుతారు’’ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ స్పష్టం చేశారు.

Bandi Sanjay: మేం అధికారంలోకి వస్తే బీసీనే సీఎం

  • బీజేపీలో బీసీలకు సముచిత స్థానం దక్కింది

  • దమ్ముంటే బీసీని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిని చేయాలి

  • కేసీఆర్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సవాల్‌

హైదరాబాద్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): ‘‘బీజేపీ బాజాప్త ఒక్కటే మాట చెప్పింది.. తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే బీసీ నాయకుడే సీఎం అవుతారు’’ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ స్పష్టం చేశారు. ‘‘పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. పార్టీ బలోపేతం కోసం అనేక రకాలుగా ఆలోచించి నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. బీసీ అయిన నాకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వలేదా..? లక్ష్మణ్‌కు ఇవ్వలేదా..? దత్తాత్రేయకు ఇవ్వలేదా..? దళితుడైన బంగారు లక్ష్మణ్‌కు పదవి ఇవ్వలేదా..? కేంద్ర పదవుల్లో బీసీ నేతలకు సముచిత స్థానం కల్పించలేదా..?’’ అని ప్రశ్నించారు. దమ్ముంటే బీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవిని బీసీ నేతకు ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు సవాల్‌ చేశారు. దళితుడిని సీఎం చేస్తానని.. లేకుంటే తల నరక్కుంటానని హామీ ఇచ్చి.. మాట తప్పిన నాయకుడు కేసీఆర్‌ అని మండిపడ్డారు. దళితుడిని సీఎం చేస్తానని మాట తప్పి, రూ.వేల కోట్లు దోచుకున్న పార్టీ బీఆర్‌ఎస్‌ అని మండిపడ్డారు.


సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. రాంచందర్‌రావు పేరును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఖరారు చేయడం వెనుక టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషించారంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సంజయ్‌ స్పందించారు. ‘‘ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వమున్న పార్టీ బీజేపీ. దేశంలోని అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ. సిద్ధాంతం కోసం నిబద్ధతతో పని చేసే లక్షలాది మంది కట్టర్‌ కార్యకర్తలున్న పార్టీ. అంత గొప్ప చరిత్ర కలిగిన బీజేపీ.. ఒకరు చెబితేనో.. ఇంకొకరు ఒత్తిడి తెస్తేనో తలొగ్గి నిర్ణయం తీసుకునే పార్టీ కాదు. ఇది కావాలని కొంత మంది చేస్తున్న దుష్ప్రచారం. అలాంటి వారిపై కఠిన చర్యలుంటాయి’’ అని అన్నారు. బీజేపీలోనూ కొందరు ఇలాంటి ప్రచారమే చేస్తున్నారంటూ మీడియా ప్రస్తావించగా.. ‘‘బీజేపీలో అలాంటివి జరగవు. ఇలాంటి పోకడలను ఇప్పుడే చూస్తున్నా. ఇది సరి కాదు. బండి సంజయ్‌ ఉంటేనే పార్టీ ఉన్నట్లు, లేకపోతే పార్టీయే లేనట్లు అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు. ఎవరు లేకపోయినా పార్టీ నడుస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి’’ అని సంజయ్‌ స్పష్టం చేశారు.

Updated Date - Jul 01 , 2025 | 04:30 AM